అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
డీఎస్పీ చంద్రభాను
ఇల్లెందురూరల్: అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ చంద్రభాను సూచించారు. మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేని 60 బైక్‌లను, ఆరు ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ కూడలిలో డీఎస్పీ మాట్లాడుతూ అపరిచితులు గ్రామంలోకి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రహదారిపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ విధిగా ధరించాలని, వాహనానికి సరైన ధ్రువీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
అందరూ సమష్టిగా పనిచేయాలి
కొత్తగూడెంరూరల్: అందరూ సమష్టిగా పనిచేసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు కీర్తి తీసుకురావాలని డీఎంహెచ్‌ఓ ఎల్.భాస్కర్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ డైరీని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బాలాజీనాయక్, డాక్టర్ సుందర్, ఎండీ. ఫైజ్ మొహియుద్దిన్, లక్ష్మి, సుదర్శన్, నాగభూషణం, జి.ఉమాదేవి, కృష్ణయ్య, లింగ్యానాయక్, దేవ, హరి, రామచందర్ పాల్గొన్నారు.
వేతనాలు విడుదల చేయాలి
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శానిటేషన్, పేషెంట్ కేర్ సెక్యూరిటీతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరుతూ సోమవారం ఐటీడీఏ పీఓ రాహుల్‌కు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. 100 మంది కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదని విన్నవించారు. కాగా ప్రస్తుత ఏజెన్సీని రద్దు చేసి, త్వరలోనే కొత్త ఏజెన్సీకి కేటాయిస్తామని, వేతనాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు సీఐటీయూ పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి తెలిపారు. సీఐటీయు నాయకులు నాగరాజు, రమ, వెంకటరమణ, కుమారి, సరిత, మెహబూబ్, రమణ, కుమారి పాల్గొన్నారు.
బాల కార్మికుడి గుర్తింపు
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ మెకానిక్ షెడ్డులో బాల కార్మికుడు పని చేస్తున్నట్లు సోమవారం పోలీసులు గుర్తించారు. బాలుడి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలను పనికి పంపొద్దని, చదివించాలని సూచించారు. అనంతరం మెకానిక్ షెడ్డు నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయలక్ష్మి తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
అశ్వారావుపేటరూరల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. అశ్వారావుపేటకు చెందిన ఓ వ్యక్తి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా గుర్తించిన స్థానికులు 100కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై టి.యయాతి రాజు ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ను పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దీంతో తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ విచారణ చేపట్టి రూ.5 వేల జరిమానా విధించారు.
అటవీ జంతువు మాంసం లభ్యం
మణుగూరు టౌన్: మండలంలోని కూనవరం పంచాయతీలో ఓ దుకాణంలో సుమారు మూడు కేజీల దుప్పి మాంసాన్ని అటవీ అధికారులు, సిబ్బంది సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని ఎఫ్‌డీఓ మక్సూద్ తెలిపారు. మాంసాన్ని ల్యాబ్‌కి పంపి పరీక్షించాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదం
మధిర: మధిరలో సోమవారం తెల్లవారుజాము న విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక వైరా రోడ్డులోని దేవినేని శ్రీనుకు చెందిన సైకిల్ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు మొదలై పక్కనే ఉన్న షేక్ సుభాని చెందిన గాలి మిషన్, అక్బర్‌కు చెందిన బిర్యానీ పాయింట్‌కు వ్యాపించారు. దీంతో మూడు దుకాణాల్లోని రూ.4లక్షల విలువైన సామగ్రి కాలి బూడిదైంది.
Comments
Please login to add a commentAdd a comment