సంక్షేమం ఎవరికో..?
జిల్లాలో నేటి నుంచి గ్రామ సభలు
● ఇప్పటికే అర్హుల జాబితాల రూపకల్పన ● ప్రజల సమక్షంలో ప్రదర్శించనున్న అధికారులు ● అవసరమైతే మార్పులు, చేర్పులు.. ● అందరి ఆమోదంతో లబ్ధిదారుల గుర్తింపు
చుంచుపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల ఎంపికకు అధికారులు సన్నద్ధమయ్యారు. అర్హుల జాబితా తయారీకి మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లో అర్హుల జాబితాలు ఎంపిక చేశాక కలెక్టర్ ఆమోదానికి పంపిస్తారు. ప్రజాపాలనలో దరఖాస్తుల ఆధారంగా ఈనెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, అర్హుల ముసాయిదా జాబితాలు రూపొందించారు. మంగళవారం నుంచి నిర్వహించే గ్రామ సభల్లో ఈ జాబితాలను ప్రజల సమక్షంలో ప్రకటించి, ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే చేస్తారు. ఈ నాలుగు పథకాలకు ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఉన్నా తిరిగి స్వీకరిస్తారు.
26న శ్రీకారం..
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి నాలుగు సంక్షేమ పథకాలను ఈనెల 26న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఈనెల 24 వరకు గ్రామ సభల నిర్వహణకు పక్కా ప్రణాళిక రూపొందించారు. గ్రామ సభల సందర్భంగా లబ్ధిదారుల వివరాల డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలని, ఫ్లెక్సీలు, మౌలిక సదుపాయాలు, ఫిర్యాదులు, అర్జీల స్వీకరణ వంటి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
‘సంక్షేమం’ ఇలా..
వ్యవసాయ యోగ్యమైన భూములకు పంట పెట్టుబడి సాయం కింద రెండు విడతల్లో కలిపి ఎకరాకు ఏడాదికి రూ.12వేలు రైతు భరోసా పథకం ద్వారా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సాగులో లేని భూములకు ఈ పథకం వర్తించదు. గతంలో జిల్లాలోని 1,84,014 మంది రైతులకు చెందిన 5,09,966 ఎకరాల భూమికి రైతుబంధు ద్వారా సాయం అందించారు. అయితే ప్రస్తుతం సాగు చేస్తున్న భూముల వివరాలను పరిశీలించిన అధికారులు.. ఆ వివరాలను గ్రామసభల్లో ప్రదర్శిస్తారు. ఆ తర్వాత అర్హత గల భూముల వివరాలను వెల్లడిస్తారు. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు రూ. 6వేలు చొప్పున ఏడాదికి రెండు విడతల్లో రూ. 12వేలు అందిస్తారు. ఇందుకు గాను 2023 – 24 సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లిన వారినే అర్హులుగా గుర్తిస్తారు. జిల్లాలో 2.19 లక్షల జాబ్ కార్డులు ఉండగా 4.50 లక్షల మంది పేరు నమోదు చేసుకున్నారు. ఇందులో 73,143 మంది కూలీలు గతేడాది 20 రోజుల పని దినాలు పూర్తి చేయగా, వడ పోసిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 41,508 మందికి ఈ పథకం వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో ముఖ్యమైన రేషన్ కార్డుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇటీవల చేపట్టిన సర్వే ఆధారంగా అధికారులు రేషన్ కార్డులు లేని పేద కుటుంబాల జాబితాను రూపొందించారు. గ్రామ, వార్డు సభల్లో వీటిని ప్రదర్శించి అర్హులను ఎంపిక చేస్తారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం 42,644 దరఖాస్తులు వచ్చాయి.
గ్రామ సభలకు ఏర్పాట్లు చేశాం
జిల్లాలో అర్హులైన వారికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే అర్హులను గుర్తించగా నేటి నుంచి జరిగే గ్రామ సభల్లో ముసాయిదా జాబితాలను ప్రజల ముందుంచుతాం. ఆయా సభల్లో చర్చించిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. అర్హులైన పేదలకు ఈ పథకాలను అందించడమే లక్ష్యం. గ్రామ సభల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం.
– డి.వేణుగోపాల్, అదనపు కలెక్టర్
ఇందిరమ్మ ఇళ్లకు 2,79,638 దరఖాస్తులు..
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి జిల్లా వ్యాప్తంగా 2,79,638 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో దారిద్య్రరేఖకు దిగువన ఉండి.. నివాస స్థలం ఉండి కూడా ఇల్లు లేనివారు, పూరిగుడిసెలు, అద్దె ఇళ్లలో ఉంటున్నవారిని అర్హులుగా నిర్ధారించారు. మట్టి గోడలు, పైకప్పు లేని గృహాలతో పాటు వితంతువులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. కాగా, దరఖాస్తులను పరిశీలించిన సిబ్బంది.. లబ్ధిదారుల ఎంపికకు వారి ఇళ్లకు వెళ్లి వివరాలను యాప్‌లో నమోదు చేశారు. మండలస్థాయి అధికారులు సూపర్ చెక్ చేశారు. దీని ప్రకారం ముసాయిదా జాబితా సిద్ధం కాగా, గ్రామ సభల్లో చర్చించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment