![అపార్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/06kgm251-192026_mr-1738953542-0.jpg.webp?itok=PU3lTkfi)
అపార్‌మైన ఆలస్యం
పాల్వంచరూరల్: విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని ఒకే కార్డు రూపంలో పొందుపరిచి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అపార్(ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నమోదు చేపట్టింది. ప్రతీ విద్యార్థికి 12 అంకెల గుర్తింపు నంబర్ కేటాయించి కార్డు అందజేయనున్నారు. ఈ నంబర్ భవిష్యత్‌లో కీలకం కానుంది. దీని ఆధారంగా విద్యార్థుల మెరిట్, విద్యార్హతలు సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అపార్ నమోదు ప్రక్రియను గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. రెండో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని విద్యాశాఖ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2025 జనవరి 31 నమోదుకు తుది గడువుగా నిర్దేశించింది. అయితే జిల్లాలో అపార్ నమోదు ప్రక్రియ అంతంత మాత్రంగానే సాగింది. విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో జిల్లాలో 54.58 శాతం, ఖమ్మం జిల్లాలో 33.29 శాతం మాత్రమే అపార్ వివరాలు నమోదు చేశారు. కాగా గత నెల 31ని గడువుగా ప్రకటించినా, ఆ తర్వాత కూడా నమోదుకు అవకాశం ఇచ్చారని అధికారులు చెబుతున్నారు.
ఆరో స్థానంలో భద్రాద్రి జిల్లా
భద్రాద్రి జిల్లాలో మొత్తం 1,692 పాఠశాలల్లో సుమారు 1,68,439 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 93,065 మంది అపార్ వివరాలు నమోదు చేయగా, ఇంకా 70,942 మంది విద్యార్థుల నమోదు జరగలేదు. మరో నాలుగు పాఠశాలల్లో అపార్ ప్రక్రియే ప్రారంభం కాలేదు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1,601 పాఠశాలలు ఉండగా, 2,13,456 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 71,063 నమోదు వివరాలు నమోదు కాగా, ఇంకా 1,42,393 మంది విద్యార్థుల వివరాలు నమోదు చేయాల్సి ఉంది. మరో పది పాఠశాలల్లో అపార్ ప్రక్రియ ప్రారంభంకాలేదు. రాష్ట్రస్థాయిలో కొత్తగూడెం జిల్లా అపార్ నమోదులో ఆరో స్థానంలో నిలవగా, ఖమ్మం జిల్లా మాత్రం 22వ స్థానంలో ఉంది.
ఇవీ ప్రయోజనాలు
అపార్ కార్డుతో విద్యార్థులకు బహుళ ప్రయోజనాలు లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న అపార్ కార్డులో విద్యార్థులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుంది. ఏ పాఠశాలలో, కళాశాలలో ఎంత వరకు విద్యాభ్యాసం చేశారు? పరీక్షల్లో ఎన్ని మార్కులు సాధించారు? అనే వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు పోగొట్టుకున్నా అపార్ నంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.
మండలాల వారీగా అపార్ వివరాలు నమోదు ఇలా..
మండలం విద్యార్థులు నమోదు పెండింగ్ శాతం
చండ్రుగొండ 3,065 2,065 926 67
సుజాతనగర్ 2,379 1,615 652 68
పినపాక 4,765 3,189 1,444 67
అశ్వాపురం 3,893 2,581 1,271 66
చుంచుపల్లి 79,52 5,110 2,729 64
ఆళ్లపల్లి 1,944 1,259 658 65
దుమ్ముగూడెం 6,937 3,996 2,785 58
పాల్వంచ 22,615 13,204 8,908 58
బూర్గంపాడు 9,759 5,432 4,026 56
లక్ష్మీదేవిపల్లి 9,738 5,484 3,946 56
టేకులపల్లి 6,330 3,863 2,295 61
ములకలపల్లి 5,031 2,515 2,440 50
మణుగూరు 12,353 6,995 5,168 57
కరకగూడెం 1,413 614 781 43
గుండాల 3,563 1,777 1,653 50
భద్రాచలం 11,707 5,539 5,904 47
అశ్వారావుపేట 8,853 4,389 4,311 50
అన్నపురెడ్డిపల్లి 3,001 1,420 1,484 47
చర్ల 6,110 2,666 3,282 44
కొత్తగూడెం 10,821 7,062 3,201 65
దమ్మపేట 8,437 3,549 4,663 42
ఇల్లెందు 13,784 6,159 7,104 45
విద్యార్థుల సమగ్ర సమాచారంతో కార్డు..
12 అంకెల నంబర్
కేటాయించాలని కేంద్రం నిర్ణయం
భద్రాద్రి జిల్లాలో
54.58 శాతం నమోదు
ఖమ్మం జిల్లాలో
33.29 శాతానికే పరిమితం
ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం..
మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే అపార్ నమోదు ప్రక్రియలో భద్రాద్రి జిల్లా ముందే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరో స్థానంలో ఉన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులతో పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించడంతో నమోదు ప్రక్రియ వేగంగా సాగింది. కొందరికి ఆధార్ కార్డులు, డేట్ ఆఫ్ బర్త్ పత్రాలు లేని కారణంగా నమోదు సమస్యగా మారింది. ప్రత్యేకంగా దృష్టి సారించి మిగిలిన నమోదును కూడా పూర్తి చేస్తాం. అపార్ కార్డుతో నకిలీ విద్యార్హత పత్రాలను అరికట్టేందుకు అవకాశం ఉంది. –వెంకటేశ్వరాచారి, డీఈఓ
![అపార్‌మైన ఆలస్యం1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/06kgm253-192026_mr-1738953542-1.jpg)
అపార్‌మైన ఆలస్యం
Comments
Please login to add a commentAdd a comment