ఐటీసీ కార్మికుడికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

ఐటీసీ కార్మికుడికి తీవ్రగాయాలు

Published Sat, Feb 8 2025 12:11 AM | Last Updated on Sat, Feb 8 2025 12:11 AM

ఐటీసీ కార్మికుడికి తీవ్రగాయాలు

ఐటీసీ కార్మికుడికి తీవ్రగాయాలు

బూర్గంపాడు: రోడ్డుపై నిలిపిన కర్రలోడ్‌ ట్రాక్టర్‌ ట్రక్కును వెనుక నుంచి ఢీ కొట్టిన ఘటనలో ఐటీసీ పర్మినెంట్‌ కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. బూర్గంపాడుకు చెందిన షేక్‌ అక్తర్‌ ఐటీసీలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజువారీలాగే గురువారం రాత్రి విధులకు తన మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న క్రమంలో పాతగొమ్మూరు వద్ద కర్ర లోడ్‌తో రోడ్డుపై నిలిపిన ట్రాక్టర్‌ ట్రక్కును వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్‌కు ట్రక్కు సరిగా కనిపించకపోవడంతో ఢీకొట్టగా తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడిని 108లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి, అక్కడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

బూర్గంపాడు: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి గురువారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముల్కలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ తాటి విజయరాంబాబు(31) ఈ నెల 3వ తేదీన ముసలిమడుగు గ్రామంలోని బంధువుల ఇంటికి మోటార్‌సైకిల్‌పై వచ్చాడు. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో సంజీరెడ్డిపాలెం వద్ద ఎదురుగా వస్తున్న మరో మోటార్‌సైకిల్‌ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిద్దరిని భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం విజయరాంబాబును ఖమ్మంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కాగా, ప్రమాదంలో గాయపడిన మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన మరో మోటార్‌సైకిలిస్ట్‌ వెలగపూడి భాస్కర్‌రెడ్డి భద్రాచలంలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనంపై నుంచి పడిన వ్యక్తి..

దుమ్ముగూడెం : మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన షేక్‌ మైదీన్‌ (40) రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మైదీన్‌ ఈ నెల 2న రాత్రి భద్రాచలం నుంచి నరసాపురంలోని తన ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో తూరుబాక కుంగిన కల్వర్టు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పురుగుల మందు తాగిన బాలిక..

దుమ్ముగూడెం: చదువుకోమని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ మైనర్‌ బాలిక పురుగుల మందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ధర్మారం కొత్తగూడెం గ్రామానికి తునికి లక్ష్మి, జోగారావు దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందులో రెండో కూతురైన దివ్యశ్రీ (16) 9వ తరగతి వరకు చదివి చదువు మానేసి ఇంట్లోనే ఉంటుంది. ఈక్రమంలో దివ్యశ్రీ తల్లిదండ్రులు మిగతా పిల్లల లాగా చదువుకోవచ్చుకదా అని తరచూ మందలిస్తుండడంతో పాటు పొలం పనులకు రమ్మని చెప్పినా వెళ్లేది కాదు. ఈ క్రమంలో గత నెల 26న ఆమె తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో నోటి నుంచి నురగతో పడి ఉన్న దివ్యశ్రీని పరిశీలించగా పురుగుల మందు వాసన రావడంతో భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి ఈనెల 6న రాత్రి మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ రాంబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

‘ఉపాధి’ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మృతి

ములకలపల్లి: మండలపరిధిలోని గడ్డంవారిగుంపు గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ (ఎఫ్‌ఏ) గడ్డం నాగరాజు (33) అనారోగ్యంతో మృతిచెందారు. మూకమామిడి, చౌటిగూడెం జీపీల పరిధిలో ఎఫ్‌ఏగా విధులు నిర్వహిస్తున్న ఆయన అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య కుమారి, ముగ్గురు కూతుర్లు, కొడుకు ఉన్నారు.

టిప్పర్‌ లారీ బోల్తా

మధిర: మధిరలోని రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద శుక్రవారం టిప్పర్‌ లారీ బోల్తా పడింది. రైల్వే మూడో లైన్‌ నిర్మాణ పనులకు మట్టి తీసుకొస్తున్న టిప్పర్‌ బ్రిడ్జి వద్ద భగీరథ పైప్‌లైన్‌ మరమ్మతులకు తవ్విన గోతిలో పడడంతో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement