![అతివల](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/dwacra_mr-1738953593-0.jpg.webp?itok=93bwaJC6)
అతివలకు ఆదరువుగా..
లక్ష్యానికి మించి రుణాల మంజూరు
●రికవరీ జిల్లాలో 92శాతం వరకు పూర్తి ●1,200 కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రణాళిక ●పట్టణాల్లో ఫుడ్‌కోర్ట్‌ల ఏర్పాటుతో ముందుకు
కొత్తగూడెంఅర్బన్: మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతూ అమలు చేస్తోంది. అందులో భాగంగా మున్సిపాలిటీలలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ–మెప్మా సంయుక్త ఆధ్వర్యాన మహిళలకు రుణాలు మంజూరు చేస్తోంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో (2024–25) జిల్లా కేంద్రం కొత్తగూడెంతో పాటుగా మిగతా మున్సిపాలిటీల్లోనూ మహిళా సంఘాలకు ఫుడ్‌కోర్ట్‌లు ఏర్పాటు చేయించి, చిరువ్యాపారాలు చేయించేలా ప్రోత్సహిస్తున్నారు.
పురుషులతో సమానంగా..
పురుషులతో సమానంగా మెప్మాలోని మహిళా సభ్యులకు ఫుడ్‌కోర్ట్‌ల ద్వారా వ్యాపారం చేసే అవకాశం లభించింది. దీంతో వారికి ఇంట్లో గౌరవం పెరగడంతో పాటు రోజుకు ఎంతోకొంత డబ్బులను సంపాదిస్తూ వారి కుటుంబాలకు ఆదరువుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో జిల్లా ప్రభుత్వాస్పత్రి పక్కన ఫుడ్‌కోర్ట్‌లో 22 షాపులు, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మరో రెండు ఏర్పాటు చేయించారు. దీంతోపాటు ఎక్కువ జనాభా గల ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం సోలార్ ఎనర్జీని వినియోగించుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తుండడంతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు, దానికి కావాల్సిన పరికరాల అమ్మకాలపై ప్రభుత్వం దృష్టి సారించి మెప్మా సంఘం సభ్యులకు సోలార్ ప్లాంట్ల బాధ్యత అప్పగించింది. దీంతో మెప్మా బాధ్యులు వాటి నిర్వహణపై కార్యాచరణ రూపొందించేలా చర్యలు చేపట్టారు.
సాంకేతిక సమస్యలతో ఆటంకం..
మెప్మా రుణాలతో పాటు సంఘంలోని సభ్యులకు సీ్త్రనిధి రుణాలనూ ఇప్పించి చిరు వ్యాపారాలను చేయిస్తున్నారు. పట్టణాల్లో వీధి వ్యాపారులకు రూ.10వేల నుంచి రూ.50 వేల వరకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి వ్యాపారాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యలతో ప్రస్తుతం వీధి వ్యాపారుల రుణాల కోసం దరఖాస్తులు, కొత్త రుణాలు, రుణాల అప్‌గ్రేడ్ వంటివి చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో లబ్ధిదారులు, అర్హత ఉన్న వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు సాంకేతిక లోపాలను సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లాలో 1,200 నూతన సంఘాలు
జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీల్లో మొత్తం 3,249 మెప్మా సంఘాలు ఉండగా.. ఇందులో 32,690 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాలనుసారం జిల్లాలో మరో 1,200 నూతన మెప్మా సంఘాలను ఏర్పాటు చేసేందుకు మెప్మా అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. ఈనేపథ్యాన రేషన్ కార్డుల ఆధారంగా మహిళల జాబితాను సేకరించి అర్హులైన వారిలో గ్రూపుకు 10 మంది చొప్పున కేటాయించి మెప్మా రుణాలు ఇప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
లక్ష్యానికి మించి రుణాలు..
మెప్మా సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆయా మున్సిపాలిటీల్లో ఫుడ్‌కోర్ట్‌లు ఏర్పాటు చేయిస్తున్నాం. దీంతో మహిళలకు ఉపాధి దొరకడంతో పాటు మరిన్ని పథకాల్లోనూ వారు భాగస్వామ్యం కానున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు టార్గెట్‌కు మించి రుణాలు ఇచ్చాం. అదే రీతిలో వారు కూడా బ్యాంకులకు చెల్లింపులు చేస్తున్నారు.
– రాజేష్, జిల్లా మిషన్ కోఆర్డినేటర్
మెప్మా రుణాల వివరాలు ఇలా...
మున్సిపాలిటీ గ్రూప్‌లు లక్ష్యం మంజూరు
(రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో)
కొత్తగూడెం 124 1,091.6 1,552.11
మణుగూరు 86 532.8 651.2
పాల్వంచ 116 703.1 2,711.25
ఇల్లెందు 95 798 935.25
మొత్తం 421 3,125.5 5,849.81
![అతివలకు ఆదరువుగా..1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/05kgm372-192021_mr-1738953594-1.jpg)
అతివలకు ఆదరువుగా..
Comments
Please login to add a commentAdd a comment