![పుష్కర కాలానికి..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/06bcm01-192041_mr-1738953543-0.jpg.webp?itok=zhkzhkLh)
పుష్కర కాలానికి..
● భద్రాచలంలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ● మిగతా పంచాయతీ, పరిషత్‌లతోపాటే ఇక్కడా ఎలక్షన్ ● 20వార్డుల్లో ఓటర్లు, పోలింగ్ బూత్‌ల జాబితా సిద్ధం ● 14 ఎంపీటీసీ స్థానాలతో మండల పరిషత్ ఎన్నికలు
భద్రాచలం: భద్రాచలంలో పుష్కర కాలం తర్వాత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీ ఏర్పాటు, మూడు పంచాయతీలుగా విభజన వంటి సందిగ్ధ పరిస్థితికి చెక్ పెడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పంచాయతీగా కొనసాగించాలనే నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో అన్ని పంచాయతీలతోపాటు భద్రాచలానికి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. రద్దయిన భద్రాచలం మండల పరిషత్‌ను మళ్లీ ఏర్పాటు చేయడంతో పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. దీంతో భద్రాచలంలో 12 ఏళ్ల తర్వాత స్థానిక ఎన్నికల సందడి నెలకొంది.
40 పోలింగ్ బూత్‌లు.. 20 వార్డులు
భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీకి చివరిసారిగా 2013లో ఎన్నికలు జరగ్గా, పాలకవర్గ పదవీ కాలం 2018లో ముగిసింది. తెలంగాణ ఆవిర్భావించాక ప్రభుత్వం భద్రాచలం, సారపాకను మున్సిపాలిటీలుగా ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా పురపాలక ఏర్పాటుకు బ్రేక్ పడింది. వెనక్కు తగ్గిన ప్రభుత్వం భద్రాచలాన్ని మూడు గ్రామపంచాయతీలు, సారపాకను రెండు పంచాయతీలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపైనా స్థానికంగా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన భద్రాచలానికి ఇది మరింత నష్టం కల్గిస్తుందని రాజకీయ పార్టీలు సైతం ఆక్షేపించాయి. అనంతర పరిణామాల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలాన్ని తిరిగి మేజర్ గ్రామపంచాయతీగా ప్రకటించింది. దీంతో 12 ఏళ్ల తర్వాత గ్రామపంచాయతీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఓటరు జాబితా సిద్ధం చేశారు. భద్రాచలాన్ని 20 వార్డులుగా విభజించి సుమారు 40 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత బుధవారం గ్రామపంచాయతీ ఈఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం జరిపారు. ఎన్నికల నిర్వహణపై సలహాలు, సూచనలను స్వీకరించి మార్గదర్శకాలను వివరించారు.
లక్ష మంది జనాభా ఉన్నా..
జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలుగా ఉన్నాయి. తాజాగా అశ్వారావుపేటను కూడా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌చేశారు. దీంతో భద్రాచలం మినహా అన్ని మేజర్ పట్టణాలు మున్సిపాలిటీలుగా మారాయి. సుమారు లక్ష మంది జనాభా ఉండే భద్రాచలాన్ని గతంలో టౌన్‌షిప్‌గా, కొంత కాలం మున్సిపాలిటీగా సైతం కొనసాగించారు. మున్సిపాలిటీ ఏర్పాటు గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా ఉండటంతో తిరిగి పంచాయతీగా కొనసాగించేందుకు నిర్ణయించారు. దీంతో నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీగా ఎన్నికలు జరగన్నాయి. జిల్లాలో కొత్తగూడెం మినహా ఇతర నియోజవకర్గ కేంద్రాల్లో కంటే భద్రాచలంలోనే అధిక జనాభా ఉంది. అయినా మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
14 ఎంపీటీసీలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం కేంద్రం మినహా ఇతర గ్రామపంచాయతీలను ఏపీలో విలీనం చేశారు. దీంతో మండల పరిషత్‌ను అప్పట్లో కొత్తగా ఏర్పడిన ఆళ్లపల్లి మండలానికి తరలించారు. ఉద్యోగులను పలు చోట్ల సర్దుబాటు చేశారు. మండల పరిషత్‌ను తిరిగి ప్రకటించటంతో ఎంపీడీఓగా నారాయణను నియమించారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో భాగంగా మండల పరిషత్‌కు సైతం ఎన్నికలను జరపాలని భావిస్తుండటంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. గతంలో మండల పరిషత్‌లో 13 ఎంపీటీసీలు ఉండగా ప్రస్తుతం వాటిని 14 స్థానాలకు పెంచారు. ఎన్నికల బూత్‌లు, జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఎన్నో ఏళ్ల తర్వాత భద్రాచలంలో గ్రామపంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల సందడి చోటు చేసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment