కొండరెడ్ల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
దమ్మపేట : కొండరెడ్లను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని, వారికి మౌలిక వసతులతో పాటు రాయితీతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. మండలంలోని పూసుకుంటలో శనివారం ఆయన పర్యటించారు. కొండరెడ్ల ఆర్థిక స్థితిగతులు, సమస్యలు, అవసరమైన మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ భవనంలో అధికారులు, గ్రామస్తులతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి కుటుంబాలుగా జీవిస్తున్న కొండరెడ్లకు డెయిరీ ఫాం, పశువుల పెంపకం, చిన్న తరహా పరిశ్రమలు మంజూరు చేయించాలని అధికారులకు సూచించారు. భూ సమస్యలను పరిష్కరించి పామాయిల్ సాగు చేయించాలని, అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు వంటివి సాగు చేసేలా చూడాలని చెప్పారు. పంటలను ఇతర ప్రాంతాల్లో విక్రయించేందుకు రవాణాకు వాహనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. చదువుకున్న యువతకు ఉపాధి కల్పించేలా కంప్యూటర్, మొబైల్ రిపేర్ వంటి రంగాల్లో శిక్షణ ఇప్పించనున్నట్టు చెప్పారు. న్యూట్రిషన్ కిట్లు అందజేసి, వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. పెరటి కోళ్ల పెంపకం, కౌజు పిట్టలు, బాతుల పెంపకానికి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. గోమూత్రం ద్వారా జీవామృతం తయారుచేసి, పంటల సాగులో ఎరువుగా వినియోగించేందుకు శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఇల్లు లేనివారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని, జాబ్ కార్డు ఉన్నవారికి రూ.2లక్షల ప్రమాద బీమా చేయిస్తామని చెప్పారు. ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ.. స్థానికంగా లభించే వెదురుతో పలు రకాల కళాఖండాల తయారీకి అవసరమైన శిక్షణ ఇప్పంచేందుకు యువతను కేరళకు పంపిస్తామని తెలిపా రు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, ఎంపీడీఓ రవీందర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ తహసీల్దార్ కె.వాణి, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాస్, ఫారెస్ట్ రేంజర్ కరుణాకరాచారి పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
అంతర పంటలతో ఆదాయం..
ములకలపల్లి : రైతులు ఒకే పంటపై ఆధార పడకుండా అంతర పంటల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. మండలంలోని పాతూరు గ్రామంలో ఈదర మురళి అనే రైతు చేపట్టిన చేపల చెరువును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ .. చేపల పెంపకం, నాటుకోళ్లు, తేనేటీగల పెంపకం, మునగ సాగు వంటి వాటితో ఆర్థికాభివృద్ధి చెందొచ్చన్నారు. తొలుత మండలకేంద్రంలో మంగపేట పీహెచ్‌సీ ప్రహరీ నిర్మాణాన్ని పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడొద్దని, సకాలంలో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ గుడ్ల పుల్లారావు, ఎంపీడీఓ గద్దె రేవతి, ఎంపీఓ లక్ష్మయ్య, ఈజీఎస్ ఏపీఓ హుస్సేన్, ఏఈలు సురేశ్, వరప్రసాద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment