![నిరీక](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/07mng61-192014_mr-1739040860-0.jpg.webp?itok=83V2GIyg)
నిరీక్షణ ఇంకెన్నాళ్లో..
బోనస్ కోసం అన్నదాతల ఎదురుచూపులు
● 60 శాతం మంది రైతులకు అందని బోనస్ ● ఇప్పటి వరకు రూ.19 కోట్లు మాత్రమే జమ ● ఇంకా రూ. 25 కోట్ల మేర పెండింగ్
బూర్గంపాడు: యాసంగి వరినాట్లు పూర్తయి నెల కావస్తోంది. రైతులు ఇప్పటికే రెండు విడతలు ఎరువులు చల్లడంతో పాటు కలుపు తీత పనులు చేస్తున్నారు. వానాకాలం సాగు చేసిన సన్నరకం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే అసలు ధరతో పాటు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ డబ్బు వస్తే యాసంగి సీజన్ పెట్టుబడికి ఉపయోగపడతాయనే ఆశతో పలువురు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మారు. అయితే బోనస్ డబ్బు ఇప్పటికీ తమ ఖాతాల్లో జమ కాకపోవడంతో పెట్టుబడికి డబ్బు లేక ఆందోళన చెందుతున్నారు. ధాన్యం విక్రయించి రెండు నెలలు కావస్తుండగా.. బోనస్ డబ్బు తమ చేతికి అందేదెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో అధికారులు సైతం ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.
అందింది కొందరికే..
ఈ ఏడాది వానాకాలంలో సన్నరకం వరి సాగు చేస్తే రైతులకు క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత నవంబర్‌లో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. రైతులు తాము సాగు చేసిన సన్న, దొడ్డు రకాల ధాన్యాన్ని ఈ కేంద్రాల్లో విక్రయించారు. అయితే ప్రారంభంలో సన్న రకం ధాన్యం అమ్ముకున్న రైతులకు వారి ఖాతాల్లో బోనస్ జమైంది. డిసెంబర్ మొదటి వారం వరకు ఈ ప్రక్రియ వేగవంతంగా సాగింది. డిసెంబర్ 10 తర్వాత సన్నరకం ధాన్యం అమ్మిన రైతులకు ప్రభుత్వ మద్దతు ధర మాత్రమే ఐదు, ఆరు రోజుల్లో వారి ఖాతాల్లో జమ అయినా.. క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్ మాత్రం ఇప్పటికీ అందలేదు. గత వారం రోజుల క్రితం అతి కొద్ది మంది రైతులకు మాత్రమే బోనస్ జమ కావడం గమనార్హం.
89,143 మెట్రిక్ టన్నులు..
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందులో 89,143 మెట్రిక్ టన్నులు సన్నరకం ధాన్యం. ఽప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు ప్రభుత్వ మద్దతు ధరల ప్రకారం నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. సన్నరకం ధాన్యం అమ్మిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ విడుదలలో మాత్రం జాప్యం జరుగుతోంది. సన్నరకం ధాన్యం విక్రయించిన రైతుల్లో ఇప్పటి వరకు 7,462 మంది బ్యాంక్ ఖాతాల్లో రూ.19 కోట్ల బోనస్ జమ కాగా, ఇంకా రూ.25 కోట్ల బోనస్ బకాయి ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి బోనస్ డబ్బు అందించాలని రైతులు కోరుతున్నారు.
200 క్వింటాళ్లకు బోనస్ రావాలి
200 క్వింటాళ్ల ఽసన్నరకం ధాన్యం అమ్మి 50 రోజులు దాటింది. ఇంతవరకు బోనస్ పడలేదు. అసలు పడతాయో లేదో తెలియటం లేదు. వడ్లు పదిహేను రోజులు ఆరబెట్టి, తూర్పారా పట్టించి ధాన్యం కాంటాలకు హమాలీలకు డబ్బు ఇచ్చి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఆమ్మితే బోనస్ అతీగతీ లేదు.
– యడమకంటి లింగారెడ్డి, రెడ్డిపాలెం
ధాన్యం అమ్మి 50 రోజులైంది
ధాన్యం అమ్మి 50 రోజులైంది. ఇప్పటి వరకు బోనస్ డబ్బులు పడలేదు. ఎప్పుడు పడతాయో కూడా ఎవరూ చెప్పడం లేదు. 100 క్వింటాళ్ల ధాన్యం అమ్మగా రూ. 50వేల బోనస్ రావాలి. ఆ డబ్బు యాసంగి పెట్టుబడికి ఉపయోగపడుతుంది అనుకుంటే రోజురోజుకు ఆలస్యమవుతోంది.
– యేరువ బ్రహ్మారెడ్డి, రైతు, రెడ్డిపాలెం
దశలవారీగా జమ అవుతున్నాయి
సన్నరకం ధాన్యానికి సంబంధించి దశల వారీగా బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. ఇప్పటి వరకు రూ.19 కోట్ల మేర బోనస్ రైతులకు అందింది. ఇంకా రూ. 25 కోట్లు రావాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు నగదు జమవుతుంది.
– రుక్మిణీదేవి, డీఎస్‌ఓ
![నిరీక్షణ ఇంకెన్నాళ్లో..1](https://www.sakshi.com/gallery_images/2025/02/9/07mng63-192014_mr-1739040861-1.jpg)
నిరీక్షణ ఇంకెన్నాళ్లో..
![నిరీక్షణ ఇంకెన్నాళ్లో..2](https://www.sakshi.com/gallery_images/2025/02/9/07mng62-192014_mr-1739040861-2.jpg)
నిరీక్షణ ఇంకెన్నాళ్లో..
Comments
Please login to add a commentAdd a comment