![రామయ్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/08bcm01-192041_mr-1739040861-0.jpg.webp?itok=mo4Mn1ol)
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
క్రీడల్లో గెలుపోటములు సహజం : ఎస్పీ రోహిత్
కొత్తగూడెంఅర్బన్ : క్రీడా పోటీల్లో గెలుపు, ఓటములు సహజమని ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ – 2025 ముగింపు వేడుకలు శనివారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా జరిగాయి. క్రీడోత్సవాల్లో అన్ని విభాగాల పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొనగా, వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఎంతో ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొని క్రీడాసక్తి ప్రదర్శించారని, వయసుతో సంబంధం లేకుండా కొందరు ఉత్సాహంగా పాల్గొనడం హర్షణీయమని అన్నారు. క్రీడల్లోనే కాకుండా జీవితంలోనూ ఎదురయ్యే ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఆదివాసీ యువతికి జాతీయ స్థాయిలో రజత పతకం
గుండాల : జాతీయ స్థాయి త్వైకాండో పోటీల్లో మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆదివాసీ యువతి పాయం హర్షప్రద రజత పతకం సాధించింది. ఆళ్లపల్లి మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన హర్షప్రద డెహ్రాడూన్‌లో జరిగిన 38వ జాతీయ త్వైకాండో 73 కేజీల క్యోరుగి విభాగంలో తెలంగాణ తరఫున ఫైనల్స్‌కు ఎంపికై ంది. అద్భుత ప్రతిభ కనబర్చి రజత పతకం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హర్షప్రదను పలువురు అభినందించారు.
100 రోజులు..
నిరంతర విద్యుదుత్పత్తి
పాల్వంచ: సూపర్ క్రిటికల్ టెక్నాలజీ 800 మెగావాట్ల సామర్థ్యం గల కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించారు. గతేడాది అక్టోబర్ 29 నుంచి ఈనెల 8 వరకు నిరంతరాయంగా 100 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి సాధించగా, సీఈ శ్రీనివాస బాబు శనివారం కర్మాగారంలో కేక్ కట్ చేశారు. ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికుల సమష్టి కృషితో ఇది సాధ్యమైందని, ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంతో నాణ్యమైన విద్యదుత్పత్తి సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఈ యుగపతి, గడ్డం శ్రీనివాసరావు, యాస్మిన్, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా
‘నవోదయ’ ప్రవేశపరీక్ష
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో వచ్చే విద్యాసంవత్సరం 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పాలేరులోని నవోదయ విద్యాలయలో 9వ తరగతికి, కూసుమంచిలోని ఉన్నత పాఠశాల, ఖమ్మంలోని ఎన్నెస్సీ కాలనీ, రిక్కాబజార్, శాంతి నగర్ ఉన్నత పాఠశాలల్లో 11వ తరగతిలో ప్రవేశాలకు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశానికి 753 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 544 మంది, 11వ తరగతిలో 1,384 మందికి గాను 1,182 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలోని పలు కేంద్రాలను ఖమ్మం డీఈఓ సోమశేఖరశర్మ, కూసుమంచి తహసీల్దార్ కరుణశ్రీ, నవోదయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పర్యవేక్షించారు.
![రామయ్యకు సువర్ణ తులసీ అర్చన1](https://www.sakshi.com/gallery_images/2025/02/9/08kgm271-192025_mr-1739040861-1.jpg)
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
![రామయ్యకు సువర్ణ తులసీ అర్చన2](https://www.sakshi.com/gallery_images/2025/02/9/08mng82-192015_mr-1739040861-2.jpg)
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
Comments
Please login to add a commentAdd a comment