సాంకేతికతతో విద్యారంగం అభివృద్ధి
కొత్తగూడెంఅర్బన్: సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి విద్యార్థులకు బోధించడం ద్వారా విద్యాభిదృద్ధి సాధ్యమవుతుందని డీఈఓ ఎం.వెంకటేశ్వరా చారి తెలిపారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లలో లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టం సాఫ్ట్‌వేర్ వినియోగంపై జిల్లాలోని గణితం, సైన్స్, సోషల్ ఉపాధ్యాయులకు శనివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్ని పాఠశాలల్లో ఈ ప్యానళ్లను ఏర్పాటు చేశామని, వాటిని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ఈనెల 11, 12 తేదీల్లో మండలాల వారీగా ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్ సమన్వయకర్తగా వ్యవహరించగా, హైదరాబాద్‌లో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లు పవన్, నాగేశ్వరరావు, రాజేష్, మోహన్ రావు, నాగరాజు, లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టం సాఫ్ట్‌వేర్ జిల్లా కోఆర్డినేటర్ కిరణ్ పాల్గొన్నారు.
11న మోటివేషనల్ సెషన్,
గైడెన్స్‌పై అవగాహన
పదో తరగతి విద్యార్థులకు ఈనెల 11న సబ్జెక్ట్ నిపుణులతో మోటివేషనల్ సెషన్, గైడెన్స్‌పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ తెలిపారు. పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా, డైరెక్టర్ నరసింహారెడ్డి హాజరై విద్యార్థులకు సందేశం ఇస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఉదయం 10 గంటలకు ఐఎఫ్‌పీ ప్యానల్‌లో టీఎస్‌ఏటీ చానల్ ఓపెన్ చేసి విద్యార్థులను సిద్ధంగా ఉంచాలని హెచ్‌ఎంలకు సూచించారు. కార్యక్రమం పూర్తయ్యేవరకు పదో తరగతి విద్యార్థులతో పాటు వారికి బోధించే ఉపాధ్యాయులంతా ఉండాలని, విద్యార్థులు వీక్షించే ఫొటోలను గ్రూప్ లో షేర్ చేయాలని ఆదేశించారు. సెక్రటరీతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు సీసీటీవీ కెమెరా, స్పీకర్లను ఏర్పాటు చేయాలన్నారు.
13 నుంచి ఎఫ్‌ఏ మార్కుల పరిశీలన
జిల్లాలో ఫార్మెటివ్ ఎసెస్‌మెంట్ మార్కుల పరిశీలన ఈనెల 13 నుంచి 17 వరకు జరుగుతుందని డీఈఓ తెలిపారు. జిల్లాలో 299 పాఠశాలల పరిశీలనకు 40 టీమ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఒక్కో టీమ్‌కు ఒక ఉపాధ్యాయుడు లీడర్‌గా వ్యవహరించడంతో పాటు ఏడు సబ్జెక్టులకు సంబంధిత టీచర్లు ఉంటారని తెలిపారు. మండల స్థాయిలో ఏంఈఓలు, జిల్లా స్థాయిలో పరీక్షల సహాయాధికారి పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.
డీఈఓ వెంకటేశ్వరాచారి
Comments
Please login to add a commentAdd a comment