![భద్రా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/08bcm23-192052_mr-1739040859-0.jpg.webp?itok=Pg043NSs)
భద్రాద్రిలో ఆధ్యాత్మిక శోభ..
భద్రాచలంటౌన్: విరాట్ విష్ణుసహస్ర నామ స్తోత్ర పారాయణ మహోత్సవంతో భద్రాచలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తుల ‘జై శ్రీరామ్.. జై శ్రీమన్నారాయణ’ నామస్మరణలతో భద్రగిరి మార్మోగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని వికాస తరంగిణి ఆధ్వర్యంలో శనివారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్‌స్వామి సారథ్యంలో సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్థానిక జీయర్ మఠం నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆరాధనా మూర్తులతో కళాశాల మైదానం వరకు శోభాయాత్ర సాగింది. భక్తుల రామనామ సంకీర్తనలు, ఆదివాసీల కొమ్ము నృత్యాలతో కనులపండువగా ప్రదర్శన చేపట్టారు. అనంతరం జీయర్‌స్వామి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ పుస్తకాలను ఆవిష్కరించి భక్తులకు పంపిణీ చేశారు.
రెండు గంటల పాటు పారాయణం..
రాత్రి 7 గంటలకు ప్రారంభమైన విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం రెండు గంటల పాటు వీనులవిందుగా సాగింది. జీయర్ స్వామి భక్తులతో పారాయణం చేయించారు. వేదికపై కొలువుదీర్చిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆరాధనామూర్తులకు మధ్య మధ్య నైవేద్యం, హారతి సమర్పించారు. చివరిగా స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించి కార్యక్రమాన్ని ముగించారు. ఈ సందర్భంగా జీయర్ స్వామి మాట్లాడుతూ.. విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పాలకులు ప్రజల సంక్షేమంపై దృష్టి సారించాలని, స్వామివారికి భక్తుల సంఖ్య పెరిగి, వారి సంపద కూడా పెరగాలని అన్నారు. విష్ణుసహస్ర నామ స్తోత్ర పారాయణం చేసిన భీష్ముడికి అనంత బలం చేకూరిందని, అటువంటి పారాయణం చేస్తే భక్తులకు సైతం అంతే శక్తి వస్తుందని చెప్పారు. ప్రజలంతా రామదాసులైతే భగవంతుడు కూడా వారి వెంటే ఉంటాడన్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న జీయర్‌స్వామి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు, ఈఓ రమాదేవి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విష్ణు సహస్రనామ పారాయణానికి సుమారు ఐదు వేల మంది భక్తులు హాజరు కాగా, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 300 మంది వలంటీర్లు సేవలందించారు. సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో దేవనాథ రామానుజ జీయర్ స్వామి, వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు, జీయర్ మఠం అధ్యక్షుడు గట్టు వెంకటాచార్యులు, చక్రవర్తి, రాము, రాఘవరెడ్డి, శ్రీనివాసరావు, కమలకుమారి, సీతామహాలక్ష్మి, అల్లం నాగేశ్వరరావు, నర్సింహారావు, హరిశ్చంద్ర నాయక్, వైద్యులు జయభారతి, సుదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా విష్ణుసహస్ర నామ పారాయణం
సామూహిక స్తోత్ర పారాయణం చేయించిన జీయర్ స్వామి
భారీగా హాజరైన భక్తులు
![భద్రాద్రిలో ఆధ్యాత్మిక శోభ..1](https://www.sakshi.com/gallery_images/2025/02/9/08bcm18-192052_mr-1739040860-1.jpg)
భద్రాద్రిలో ఆధ్యాత్మిక శోభ..
![భద్రాద్రిలో ఆధ్యాత్మిక శోభ..2](https://www.sakshi.com/gallery_images/2025/02/9/08bcm21-192052_mr-1739040860-2.jpg)
భద్రాద్రిలో ఆధ్యాత్మిక శోభ..
![భద్రాద్రిలో ఆధ్యాత్మిక శోభ..3](https://www.sakshi.com/gallery_images/2025/02/9/08bcm20-192052_mr-1739040860-3.jpg)
భద్రాద్రిలో ఆధ్యాత్మిక శోభ..
Comments
Please login to add a commentAdd a comment