దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 116 పాయింట్లు నష్టపోయి 23,383కు చేరింది. సెన్సెక్స్ 329 పాయింట్లు దిగజారి 76,878 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 105.8 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85.09 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.26 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం, నాస్‌డాక్ 0.16 శాతం నష్టపోయాయి.
జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశ నిర్ణయాల ప్రభావం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశ నిర్ణయాలతో ట్రేడింగ్‌పై ప్రభావం ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఎరువులపై జీఎస్‌టీ 18% నుంచి 5 శాతానికి తగ్గింపు ప్రతిపాదనను మంత్రుల బృందానికి (జీవోఎం) సిఫార్సు చేయడంతో ఫెర్టిలైజర్ స్టాక్‌ల్లో కదలికలు ఉండొచ్చని నిపుణులు చెబుతన్నారు. ఈ సమావేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌పై జీఎస్‌టీకి సంబంధించి ఎటువంటి చర్చ జరగకపోవడంతో ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చని అభిప్రాయపడుతున్నారు.
పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు
విధాన సంస్కరణలు, ఆర్థిక వృద్ధి కొనసాగింపుపై అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ఈ జూన్ ఇప్పటివరకు(జూన్ 21 నాటికి) నికరంగా రూ.12,170 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫైనాన్సియల్ సర్వీసెస్, టెలికం, రియల్టీ షేర్ల పట్ల ఆసక్తి కనబరిచారు. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లను విక్రయించారు. ఇక డెట్ మార్కెట్‌లో రూ.10,575 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment