హైదరాబాద్: ఏటా లక్షల్లో పెరుగుతున్న వాహనాలు.. పరిమిత సంఖ్యలో పెట్రోల్, డీజిల్ వనరులు.. దీనికి తోడు విజృంభిస్తున్న వాహన కాలుష్యం.. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కనిపిస్తున్న ప్రత్యామ్నాయం.. విద్యుత్ వాహనాలు. అందుకే ప్రపంచం మొత్తం ప్రస్తుతం విద్యుత్ వాహన(ఎలక్ట్రిక్ వెహికల్స్-ఈవీ) తయారీ రంగంపై దృష్టి సారిస్తోంది. (చదవండి: ఐటీ ‘రిటర్న్స్’ విషయంలో జర జాగ్రత్త..!)
తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థకు కేంద్ర బిందువుగా మార్చేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020–2030’ని రూపొందించింది. గత ఏడాది ఈ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఈవీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి, తయారీకి ప్రోత్సాహం, వ్యక్తిగత, వాణిజ్య రంగాల్లో రవాణా ఖర్చు తగ్గింపు, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పదేళ్ల పాటు కొత్త పాలసీ పనిచేస్తుంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలను కొన్న వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030 కింద రాష్ట్రంలో ఎలక్ట్రిక్, బ్యాటరీ (ఈవీ) వాహనాలను ప్రోత్సహించడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ పూర్తిగా మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో జోరందుకున్న ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు. pic.twitter.com/StgeBHEUd6
— TRS Party (@trspartyonline) September 3, 2021
నూతన విధానంలోని ముఖ్యాంశాల్లో కొన్ని..
- తొలి విడతలో తయారయ్యే రెండు లక్షల ద్విచక్ర వాహనాలు, 30 వేల ఆటో రిక్షాలు, 5వేల కార్లు (టాక్సీలు, క్యాబ్‌లు తదితరాలు), 500 ఎలక్ట్రిక్ బస్సులకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీ వంద శాతం ఉచితం.
- వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే విద్యుత్ వాహనాల కొనుగోలుకు స్వయం ఉపాధి పథకాల కింద ఆర్థిక సాయం.
- విద్యుత్ ట్రాక్టర్లకు రవాణా శాఖ నిబంధనలకు లోబడి వంద శాతం రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు.
- నగరం నలుమూలల నుంచి హైదరాబాద్ మెట్రో స్టేషన్లకు బ్యాటరీ ఆధారిత వాహనాలు నడపడం.
- ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో దశల వారీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు. వీటికి విద్యుత్ నియంత్రణ కమిషన్ ప్రత్యేక టారిఫ్ వసూలు చేస్తుంది.
- చార్జింగ్ స్టేషన్లు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని టీఎస్ రెడ్కో మదింపు చేస్తుంది. అవసరమైన విద్యుత్ సరఫరాపై డిస్కమ్‌లతో సమన్వయం చేస్తుంది.
- వేయికి పైగా కుటుంబాలు కలిగిన టౌన్‌షిప్‌లు చార్జింగ్ స్టేషన్ లాట్లు ఏర్పాటుకు ప్రోత్సాహం.
- ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్, పార్కింగ్ జోన్ ఏర్పాటు. ప్రజా రవాణా రంగంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగానికి ప్రోత్సహించడం.
- విద్యుత్ వాహనాలు, సంబంధిత పరికరాలు తయారు చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు. రూ.200 కోట్ల పెట్టుబడి, వేయి మందికి ఉపాధి కల్పించే మెగా కంపెనీలకు 20శాతం పెట్టుబడి రాయితీ. ఏడేళ్ల పాటు ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్, ఐదేళ్ల పాటు గరిష్ఠ పరిమితి రూ.5 కోట్లు మించకుండా 25శాతం విద్యుత్ రాయితీ, ఐదేళ్ల పాటు విద్యుత్ సుంకం, స్టాంప్ డ్యూటీపై వంద శాతం రాయితీ.
- ప్రత్యేక మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు, ఈవీ తయారీ పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులు కల్పిస్తారు. ప్రభుత్వ శాఖల ద్వారా ఈవీల కొనుగోలు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, టీ వర్క్స్‌లో ప్రత్యేక ప్రోటోటైపింగ్ విభాగం ఏర్పాటు వంటివి నూతన పాలసీలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment