● నిలువ నీడలేదని బాధితులుకన్నీరుమున్నీరు
● వెదురుకుప్పంలో అధికారుల దాష్టీకం
● రాజకీయ నేతల ఒతిళ్లే కారణమంటున్న స్థానికులు
వెదురుకుప్పం: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండల కేంద్రంలో వాణిజ్య సముదాయం పక్కన ఓ మైనారిటీ వర్గానికి చెందిన ఇంటిని బుధవారం అధికారులు కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. నిలువ నీడ లేదు.. మమ్మల్ని కరుణించండి అని కాళ్లు పట్టుకున్నా అధికారులు కనికరించలేదని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. మండలంలోని వేపేరి గ్రామానికి చెందిన ఖాదర్ బాషా, కై రూన్‌బీ గుజరీ సామాన్ల వ్యాపారం చేసి జీవనం సాగిస్తున్నారు.
వారు గత కొంతకాలంగా వెదురుకుప్పంలో స్థిరపడి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇల్లు లేకపోవడంతో వెదురుకుప్పం పెద్దచెరువుకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో చిన్న షెడ్డు వేసుకుని అందులో తలదాచుకుంటున్నారు. బుధవారం రెవెన్యూ అధికారులు పోలీసుల బందోబస్తుతో వచ్చి వారి ఇల్లు కూల్చివేశారు. ఈ సందర్భంగా ఖాదర్‌బాషా, కై రూన్‌బీ అధికారుల కాళ్లు పట్టుకున్నారు. చేతులెత్తి మొక్కారు.
‘‘మేం పేదలం.. మాకు నిలువ నీడ లేదు. ఉన్నఫళంగా ఇంటిని కూల్చి మా కుటుంబాన్ని వీధుల పాల్జేస్తే మేం ఎక్కడ ఉండాలి.. ఎలా బతకాలి.. మేం అమాయకులం.. మాకు ఎలాంటి రాజకీయ పలుకుబడి లేదు.. మాకు దిక్కు లేదు.. కేవలం రాజకీయ కక్షతోనే మాపై ప్రతాపం చూపిస్తున్నారు.. ఇది మంచిది కాదు.. పోలీసులు మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసి వేధించి.. ఇంటిని కూల్చివేయడం దారుణం.. మాలాంటి పేదల జీవితాలను వీధుల పాలు చేసిన ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం’’ అంటూ బోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment