పేదల కడుపు కొడితే ఊరుకోం
ఏ ప్రభుత్వమైనా పేదల కోసం పనిచేయాలి.. మైనారిటీ వర్గానికి చెందిన ఓ పేద కుటుంబం ఇల్లు లేక తాత్కాలికంగా నిర్మించుకున్న ఇంటిని కూల్చి వేస్తే ఆ కుటుంబం బజారున పడుతుందని వైఎస్సార్‌సీపీ గంగాధరనెల్లూరు ఇన్‌చార్జ్ కృపాలక్ష్మి మండిపడ్డారు. బుధవారం వెదురుకుప్పం మండల కేంద్రంలో అధికారులు నిరుపేద అయిన ఖాదర్ బాషా ఇంటిని కూల్చివేయడంపై ఆమె సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె అధికారులతో మాట్లాడుతూ అక్రమంగా భవనాలు నిర్మించుకున్న వారిని వదిలేసి, ఇలా పేదవారిపై కక్ష కట్టడం ఏంటని ప్రశ్నించారు. మైనారిటీ వర్గానికి చెందిన వారని తెలిసి అధికారులు విచక్షణారహితంగా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా బలవంతంగా మహిళలన్న విచక్షణ లేకుండా కొట్టి, రోడ్డుపైకి ఈడ్చి చిత్రహంసలకు గురి చేయడం ఏంటన్నారు. కనీసం వారికి ప్రత్యామ్నాయ వసతి ఏర్పాట్లు కూడా చేయకుండా ఇంటిని కూల్చితే వారు ఎక్కడ ఉండాలని తహసీల్దార్ రమేష్‌బాబును అడిగారు. నిబంధనల ప్రకారం పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఆక్రమణను తొలగించారని తహసీల్దార్ చెప్పారు. ముందుగానే నోటీస్ ఇచ్చి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. చెరువులో ఉన్న వారందరికీ నోటీసులు ఇచ్చినప్పుడు అందరివీ కూల్చకుండా.. కేవలం ఒక్కరిపైనే ఎందుకు కక్ష సాధింపు ఏంటని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయక్తు కార్యదర్శి బండి హేమసుందర్‌రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రామయ్య ప్రశ్నించారు. వారికి ముందుగా ఇంటి స్థలం చూపించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. తహసీల్దార్ స్పందిస్తూ ఇంటి స్థలం మంజూరుకు చర్యలు తీసుకుంటామని, తంగేళిమిట్ట సమీపంలో ఉన్న లేఅవుట్‌లో ఇంటి స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కింది స్థాయి సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో బొమ్మయ్యపల్లె సర్పంచ్ గోవిందయ్య, జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యుడు శివాజి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గఫూర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment