పారదర్శక సేవలకు ‘సహకారం’
ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాత్ర కీలకం. వాటిని మరింత బలోపేతం చేసి రైతులకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో కేంద్ర సహకార మంత్రిత్వశాఖ అడుగులు వేసింది. ఇంతవరకు చేతిరాతలతోనే కొనసాగిన సహకార సంఘాల ఆర్థిక లావాదేవీలు, రుణాల మంజూరు, వ్యాపారాల నిర్వహణలో అవకతవకలకు చెక్ పెడుతూ పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. అక్రమాలకు తావులేకుండా సంఘాల రికార్డులు, నిర్వహణకు సంబంధించి ఇకపై అన్నీ కంప్యూటరీకరణ వైపు అడుగులు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో సభ్యులు, ఖాతాల లెక్కలు తేల్చి ఆన్‌లైన్ ప్రక్రియను వేగవంతం అవుతున్నాయి.
కాణిపాకం: ప్రాథమిక సహకార సంఘాలు అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. కాగా ఇప్పటివరకు ఈ సంఘాల రికార్డుల నిర్వహణ పూర్తిగా చేతిరాతలతోనే జరుగుతున్నాయి. నిర్వహణలో పారదర్శకత లేకపోవడంతో కోట్ల రూపాయలు అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కేంద్ర సహకార మంత్రిత్వశాఖ నడుం బిగించింది. దీంతో ప్రతి సహకార సంఘ రికార్డులను నాబార్డు నిధులతో కంప్యూటరీకరణ చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయారు. జిల్లాలో 37 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, వాటి పరిధిలో సుమారు 1.50 లక్షల మంది సభ్యులు, ఖాతాదారులు ఉన్నారు. దాదాపు రూ.300 కోట్లు రుణాలు సైతం అందజేశారు.
సాంకేతికతకు పెద్దపీట..
అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా చేయూతనిచ్చి రైతులకు సాయం అందించాలని ముందుకొచ్చింది. నాబార్డు ద్వారా తోడ్పాటునందించి మరింత బలోపేతం చేయాలని సంకల్పించింది. ఇందుకు లావాదేవీలు, ఖాతాల నిర్వహణ, రికార్డులు, సభ్యుల సమాచారాన్ని కంప్యూటరీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. కంప్యూటరీకరణ సేవలను కల్పించేందుకు ఒక్కో పరపతి సంఘానికి రూ.3.90 లక్షలు కేటాయించారు. కేంద్రం వాటా 60 శాతం కాగా, రాష్ట్ర వాటా 30 శాతం, నాబార్డు లేదా పీఏసీఎస్ 10 శాతం ఖర్చు చేసే విధంగా అనుమతిచ్చారు. కంప్యూటరీకరణ, ఆన్‌లైన్ సేవలందించడానికి ప్రతి సభ్యుడు, ఓటరు సమాచారాన్ని నమోదు చేయడానికి ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయాలని ఆదేశాలందాయి. ఆన్‌లైన్ ప్రక్రియ వేగవంతం చేస్తూ..నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకార సంఘాల అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల రికార్డుల కంప్యూటరీకరణ నాబార్బు నిధులతో శరవేగంగా ప్రక్రియ ఈ నెలాఖరుకు ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు ఇప్పటికే 80 శాతం సొసైటీల రికార్డుల కంప్యూటరీకరణ పూర్తి
త్వరలో పూర్తి చేస్తాం..
ప్రాథమిక సహకార సంఘాల ద్వారా సేవలను మరింత విస్తృతం చేసేందుకే నవీకరణ దిశగా శ్రీకారం చుట్టాం. అక్రమాలకు తావులేకుండా పారదర్శక సేవలు అందాలన్నదే లక్ష్యం. ఈ ప్రక్రియ అమల్లోకి తెచ్చేందుకు యుద్ధప్రాతిపదికన ఆన్‌లైన్‌లో నమోదు కొనసాగుతోంది. ఉద్యోగులంతా దీనిపైనే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 80 శాతానికి పైగా డేటా ఎంట్రీ పూర్తయింది. ఈ నెలాఖరుకు వందశాతం పూర్తి చేస్తాం.
– మనోహర్‌గౌడ్, సీఈఓ,
జిల్లా సహకార సంఘ బ్యాంక్, చిత్తూరు
ఉపయోగం ఇలా..
పీఏసీఎస్‌లను నాబార్డు సాఫ్ట్‌వేర్ ద్వారా డీసీసీబీలకు జాతీయ నెట్‌వర్క్‌లతో అనుసంధానం చేసేలా కేంద్ర సహకార మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. దీంతో సొసైటీలో నమోదైన ప్రతి ఖాతాదారుడికీ కంప్యూటరైజ్డ్ పాసుబుక్ వస్తుంది. అందులో తీసుకున్న రుణం, చెల్లిస్తున్న సొమ్ము ఖాతాకు జమవుతున్న వడ్డీ, తదితర వివరాలను ఆధార్ అనుసంధానం చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ నేరుగా రైతుల ఖాతాలకే జమకానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment