వేగానికి కళ్లెం
● మెసానిక్ మైదానం రోడ్డులో భారీ వాహనాలు నిషేధం ● సాక్షి కథనానికి స్పందించిన పోలీసులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని మెసానిక్ మైదానం–రిజర్వు ఫారెస్టు రోడ్డులో వేగానికి కళ్లెం పడింది. ఈ మార్గంలో ఓ తల్లి తన కుమారున్ని ద్విచక్రవాహనంలో తీసుకెళ్తుండగా.. ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఎమిదేళ్ల పిల్లాడు ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన తరువాత కూడా ఈ రోడ్డులో భారీగా ట్రాక్టర్లు, వాహనాలు అత్యంత వేగంతో వెళుతున్నాయి. ఈ పరిస్థితిపై ‘సాక్షి’ దినపత్రికలో మూడు రోజుల క్రితం ‘అతివేగం.. పడదా కళ్లెం?’ శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనికి చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు స్పందించారు. గురువారం ఈ మార్గంలో వెళ్తున్న ఇసుక, మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా లేని వాటికి జరిమానాలు విధించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ మెసానిక్ రోడ్డు గుంతలమయంగా మారడంతో ఇటువైపు వెళ్లే వాహనాలు, ఒక్కోసారి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొడుతున్నాయన్నారు. బైక్‌లు, కార్లు, ఆటోలు తప్ప మరే ఇతర వాహనాలు మెసానిక్ రోడ్డు మీదుగా వెళ్లడానికి వీల్లేదన్నారు. వాహన చోదకులు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment