హడల్
ఆహ్వానం..
ఆధునిక కాలం.. అంతా డిజిటల్ మయం.. ఉరుకులు, పరుగుల జీవనం.. శుభకార్యాలకు ఆహ్వానించలేని జీవనయానం.. వెరసి.. అన్నీ ఆన్లైన్లోనే జరుపుతున్న జనం.. ఈ డిజిటల్ పయనం.. సైబర్ నేరగాళ్లకు వరం.. ఫలితం..స్మార్ట్‌ఫోన్ వాట్సాప్‌కు వివాహ ఆహ్వాన పత్రిక వచ్చినా, టచ్ చేయాలన్నా భయం. కారణం.. సైబర్ చోరుల కబంధ హస్తాల్లోకి డేటా చేరుతున్న వైనం. దీంతో హడలెత్తి పోతున్న నేటితరం. ఇదీ నేటి సైబర్ నేరాల పరిస్థితి.
పలమనేరు: గతంలో ఎవరిదైనా వివాహశుభకార్యమైతే ఇళ్లకు వెళ్లి పెళ్లిపత్రికలు ఇవ్వడం ఆనవాయితీ. ఇప్పుడంతా డిజిటల్ మయమైంది. అన్నింటికీ స్మార్ట్ ఫోనే దిక్కయ్యాయి. అందులోనే వివాహ ఆహ్వాన పత్రికలను బంధువులు, స్నేహితులకు పంపుతున్నారు. వెడ్డింగ్ కార్డు అయినందున తప్పకుండా వాట్సాప్‌లో వచ్చిన మెసేజీని టచ్ చేసి చూడాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు హ్యాకర్ల పాలిట వరంలా మారింది. ఆయా ప్రాంతాల్లో బాగా తెలిసిన వారి పెళ్లి డిటిటల్ కార్డులను హ్యాకర్లు డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఏపీకే ఫైల్‌గా మార్చి వేలాది మందికి వాట్సాప్‌లో పంపుతున్నారు. కచ్చితంగా చూడాలి కాబట్టి మనం ఆ మెసేజ్‌ను టచ్ చేశామో అంతే సంగతులు. మన ఫోన్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లి మన వ్యక్తిగత డేటా, మన బ్యాంకు వివరాలన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. దీంతో మనకు తెలియకుండానే మన బ్యాంకు ఖాతాల్లోని డబ్బు సైబర్ నేరగాళ్లకు చేరిపోతోంది.దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవరసం ఎంతైనా ఉంది.
ఇది ఎలా వెలుగు చూసిందంటే..
పలమనేరుకు సమీపంలోని నంగిళిలో ఓ వ్యాపారి తన కుమార్తె పెళ్లి కార్డులను మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చేయించి దాన్ని బంధువులకు, స్నేహితులకు వాట్సాప్‌కు పంపారు. దీన్నే కొందరు హ్యాకర్లు కాపీ చేసి, అందులో ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజి కిట్) ఫైల్‌ను సెట్‌చేసి పలువురు మొబైళ్లకు పంపారు. దీన్ని ఓపెన్ చేసినవారి ఫోన్లలోకి ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అయి వారి మొబైళ్లు హ్యాక్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కొందరు మొబైల్లో ఏపీకే ఫైల్‌ను రీసెట్ చేయడం ద్వారా మెయిల్, పాస్వర్డ్ మార్చుకుని టూస్టెప్ వ్యాలిడేషన్ చేసుకుని ఆపై డిలీట్ చేసుకున్నారు. మరికొందరి ఖాతాల్లోంచి దాదాపు రూ.1.60 లక్షల వరకు పోగొట్టుకున్నట్టు తెలిసింది. దీంతో కొందరు బాధితులు మాత్రం సైబర్‌సెల్‌కు సెల్‌ఫోన్ ద్వారానే ఫిర్యాదులు కూడా చేశారట. కానీ పోయిన నగదు వారికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.
సైబర్ నేరాలు.. బహుముఖం
వాట్సాప్‌కు ఆహ్వానాలు
వెడ్డింగ్ ఇన్విటేషన్గా ఏపీకే ఫైల్‌ను పంపుతున్న హ్యాకర్లు
పెళ్లిపత్రికని టచ్ చేస్తే అంతే సంగతులు
మన మొబైల్లోని డాటా మొత్తం
హ్యాకర్ల కంట్రోల్‌కి
ఆపై ఖాతాలో డబ్బులు హ్యాకర్లపాలు
కొత్త కొత్త టెక్నిక్‌లు వాడుతున్న మోసగాళ్లు
ఇప్పటి వరకు బ్యాంకుల పేరిట..
ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో చాలామంది మొబైళ్లకు పలు బ్యాంకుల నుంచి మెసేజ్‌లు పంపినట్టు హ్యాకర్లు ఏమార్చారు. దీంతో చాలామంది మొబైళ్లు హ్యాక్ అయి మన ఫోన్లను మిర్రర్ ఇమేజి ద్వారా అక్రమార్కులు ఎక్కడి నుంచో ఆపరేట్ చేసి మన డేటాను వాడుకున్నారు. దీనిపై సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. మొబైల్ హ్యాక్ అయితే ఎలా హ్యాకింగ్ నుంచి బయటపడాలో సైతం ప్రజలకు తెలిసింది. దీంతో చాలామంది అప్రమత్తమై బ్యాంకు పేరిట వస్తున్న మెసేజీలను టచ్ చేయకుండా పోయారు. ఈ పథకం వర్క్ అవుట్ కాకపోవడంతో హ్యాకర్లు ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కాబట్టి డిజిటల్ ఇన్విటేషన్ వీడియోల ద్వారా హ్యాకింగ్‌కు దిగినట్టు ఇటీవల వెలుగుచూస్తున్న సంఘటనల ఆధారంగా తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలిసో తెలిక మొబైల్‌కు వచ్చే లింకులను టచ్ చేయకుండా ఉండడం ఉత్తమమైన పని.
Comments
Please login to add a commentAdd a comment