సర్వేశ్వరా..! | - | Sakshi
Sakshi News home page

సర్వేశ్వరా..!

Published Thu, Jan 9 2025 3:03 AM | Last Updated on Thu, Jan 9 2025 3:03 AM

సర్వేశ్వరా..!

సర్వేశ్వరా..!

రోవర్లు లేవీ..
● జిల్లాలో రీ సర్వే పునఃప్రారంభానికి సన్నాహాలు ● గత వైఎస్సార్‌సీపీ సర్కారులో విజయవంతంగా రీ సర్వే ● ప్రస్తుత రీ సర్వేకి రోవర్లు, ల్యాప్‌టాప్‌ల కొరత ● జిల్లాలో 31 గ్రామాల్లో రీ సర్వేకి అధికారుల కసరత్తు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని 31 గ్రామాల్లో రీ సర్వేను తిరిగి పునఃప్రారంభించేందుకు అధికారిక యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ రీ సర్వేకి ముఖ్యమైన రోవర్లు, ల్యాప్‌టాప్‌లు కొరత ఏర్పడింది. దీంతో రీ సర్వే ఎంత పకడ్బందీగా చేపడుతారోనని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు రీ సర్వేపై పలు అస్యత ఆరోపణలు చేశారు. వాస్తవాలకు మసి పూసి మారేడు కాయ చేసి, ప్రజలను మోసం చేసేలా అసత్య ప్రచారాలు చేసి మోసగించారు. రీ సర్వేలో భాగమైన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో భూములు లాగేసుకున్నారని, కబ్జా చేశారని, విస్తీర్ణం తగ్గించేశారని, రికార్డులు ట్యాంపర్‌ చేశారంటూ ఎన్నికల సమయంలో అనేక ఆరోపణలు చేశారు. భూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై అభూతకల్పనలు సృష్టించి, దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న రీ సర్వే పనులను నిలిపివేశారు. సర్వేలో తప్పులు జరిగాయని, వాటిని సరి చేస్తున్నట్లు హడావుడి చేశారు.

మండలానికో గ్రామం చొప్పున ఎంపిక

గత వైఎస్సార్‌ సీపీ సర్కారు శ్రీకారం చుట్టిన భూముల రీ సర్వేని ప్రస్తుత కూటమి సర్కారు తిరిగి పునఃప్రారంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో జిల్లాలోని ప్రతి మండలంలో ఒక్క గ్రామాన్ని ఎంపిక చేశారు. మొత్తం 30,850 ఎకరాల్లో రీ సర్వే చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సర్వే కోసం ఇద్దరు గ్రామ సర్వేయర్లు, ఒక వీఆర్వోతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క బృందం రోజుకు 20 ఎకరాలు సర్వే చేసి, అదే రోజు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు.

రోవర్లు, ల్యాప్‌టాప్‌ల కొరత

రీ సర్వే నిర్వహణకు రోవర్లు, ల్యాప్‌టాప్‌లు కొరత ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న రీ సర్వేకి ప్రతి బృందానికి తప్పనిసరిగా రోవర్‌, ల్యాప్‌టాప్‌ ఉండాలి. ప్రతి బృందానికి ఒక రోవర్‌ చొప్పున పరిగణలోకి తీసుకుంటే దాదాపు 100 వరకు రోవర్లు అవసరం ఉంటుంది. 55 రోవర్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయికి వెళితేకానీ ఎన్ని పనిచేస్తాయో తెలియని పరిస్థితి ఉందని సిబ్బంది వెల్లడిస్తున్నారు. రీ సర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తగినన్ని రోవర్లు లేకపోవడంతో అసలు ప్రారంభంలోనే రీ సర్వేకి ఆటంకం కలుగుతోంది. రోవర్లు ఒక్కటే కాదు..సిబ్బందికి తగినన్ని ల్యాప్‌టాప్‌లు సైతం లేవని తెలుస్తోంది. రోవర్లు, ల్యాప్‌టాప్‌లు లేకుండా రీ సర్వే ఎలా కొనసాగిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

సర్వే పకడ్బందీగా చేస్తే చాలు

మాది వెదురుకుప్పం మండలం చిన్ననక్కలాంపల్లి గ్రామం. మాకు 18.08 ఎకరాల భూమి ఉంది. మా పూర్వీకుల నుంచి వస్తున్న భూమి అది. ఆ భూమిలోనే పంటలు పండించుకుని జీవనాధారం పొందుతున్నాం. ముందున్న ప్రభుత్వంలో రీ సర్వే పకడ్బందీగా నిర్వహించారు. ఈ ప్రభుత్వం వచ్చాకా ఎందుకో రీ సర్వే ఆపేశారు. మా భూమికి సర్వే నంబర్‌ లేక చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. సర్వే చేసి హద్దులు గుర్తించి సర్వే నంబర్‌ ఇవ్వాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చాను. ఇప్పుడేమో రీ సర్వే మళ్లీ ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఈ సర్వే పకడ్బందీగా నిర్వహించి నాకు న్యాయం చేస్తే చాలు.

– నీలావతి, వెదురుకుప్పం మండలం

వైఎస్సార్‌సీపీ సర్కారులో 329 గ్రామాల్లో రీ సర్వే పూర్తి

జిల్లా వ్యాప్తంగా 822 రెవెన్యూ గ్రామాలున్నాయి. మొత్తం విస్తీర్ణం 13,02,228.96 ఎకరాలు ఉంది. అందులో 329 రెవెన్యూ గ్రామాల్లో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రీ సర్వేని పూర్తి చేయగా, మిగిలిన 493 రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే నిర్వహించాల్సి ఉంది. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పరిపాలనలో 329 రెవెన్యూ గ్రామాల్లో 3,02,555.56 ఎకరాల్లో రీ సర్వే పూర్తి చేశారు. 3,25,897 ఎల్‌పీఎం (సర్వే నంబర్ల స్థానంలో ఎల్‌పీఎం నంబర్లను ప్రవేశపెట్టారు). 33,30,666 సర్వే రాళ్లను నాటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement