టీటీడీదే బాధ్యత
పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయని టీటీడీ అధికారులే ఈ ఘోరానికి బాధ్యత వహించాలి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తుల ప్రాణాలతో చెలగాటమాడారు. ఇంత మంది తీవ్రంగా గాయపడేందుకు కారణమయ్యారు. పోలీసులు సైతం అత్యంత బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించారు. ఈక్రమంలో ప్రభుత్వం స్పందించాలి. బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి.
– మురళి, జిల్లా కార్యదర్శి, సీపీఐ
ప్రాణాలతో చెలగాటం
టీటీడీ అధికారులు శ్రీవారి భక్తుల ప్రాణాలతో చెలగాటమాడారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు పంపిణీ చేసేందుకు పది రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నామంటూ ప్రకటనలు గుప్పించారు. చివరకు చేసింది ఇదా. ఇంతమంది ప్రాణాలకు ఎసరు పెడతారా. ఈ ఘెరానికి కారకులను వదిలిపెట్టకూడదు. కఠినంగా శిక్షించాలి. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి.
– వందవాసి నాగరాజు, జిల్లా కార్యదర్శి, సీపీఎం
పరిహారం చెల్లించాలి
టీటీడీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇన్ని ప్రాణాలు పోయాయి. బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించాలి. ఘటనకు కారకులైన పోలీసులపై చర్యలు చేపట్టాలి. శ్రీవారి భక్తులను ఇంతగా ఇబ్బంది పెట్టినందుకు టీటీడీ బోర్డు వెంటనే దిగిపోవాలి. ఈఓ, అదనపు ఈఓ బాధ్యత తీసుకోవాలి. భక్తులకు సేవ చేయాల్సిన అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు.
– కందారపు మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ
విచారకరం
భక్తుల రద్దీకి తగ్గట్టు టీటీడీ అధికారులు ఏర్పాటు చేయలేదు. ఇంత పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తే కనీస వసతులు కూడా కల్పించలేదు. పైగా క్యూల నిర్వహణ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. భక్తులను క్యూలోకి వదిలేశారే కానీ, అన్నప్రసాదాలు సైతం అందించలేదు. అసలు తొక్కిసలాటకు పోలీసుల వైఖరే కారణం. భక్తులను నిర్దాక్షిణ్యంగా ఒకరిపై ఒకరిని నెట్టేశారు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సిన దుస్థితి దాపురించింది.
– రాజగోపాల్ రెడ్డి, భక్తుడు, వేంపల్లె
ప్రాణాల మీదకు తెచ్చారు
వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకుందామని కుటుంబంతో కలిసి వస్తే ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. టీటీడీ అధికారులు ఏమాత్రం ఏర్పాట్లు చేయలేదు. క్యూలోకి తోసేసి పట్టించుకోలేదు. ఇక పోలీసులైతే చాలా దురుసుగా ప్రవర్తించారు. వారి వ్యవహార శైలే ఇంతమంది ప్రాణాల మీదకు తెచ్చింది. మా కళ్ల ముందే చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించడంలో కూడా ఆలస్యం చేశారు.
– కేశవన్, భక్తుడు,
మధురై, తమిళనాడు
Comments
Please login to add a commentAdd a comment