సమీక్ష.. ఏంటీ శిక్ష!
నిత్యం విధి నిర్వహణలో బిజీ ఉంటాం. అహర్నిశలు ప్రజా సమస్యల పరిష్కారానికే కృషి చేస్తుంటాం. వివిధ అభివృద్ధి పనులు.. సంక్షేమ పథకాల అమలుపై నివేదికలు అందిస్తుంటాం. అలాగే వీడియో కాన్ఫరెన్స్‌లు.. టెలీ కాన్ఫరెన్స్‌లతో ఊపిరి తీసుకునే అవకాశం కూడా లేకుండా పనిచేస్తుంటాం. ఇదంతా మా బాధ్యతలు నెరవేర్చడంలో భాగం. సంతోషంగా ఆ పనులు పూర్తి చేస్తాం. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టే సమావేశాలతోనే అసలు తంటా వస్తోంది అంటూ అధికారులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. కుప్పం వచ్చిన ప్రతిసారీ అర్ధరాత్రి వరకు సమీక్షించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో అలసిసొలసిన సమయంలో మీటింగ్ ఏర్పాటు చేసి గంటల తరబడి సాగదీయడంపై ఆందోళన చెందుతున్నారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్ : సీఎం చంద్రబాబు కుప్పంలో అర్ధరాత్రి వరకు సమీక్షా సమావేశం నిర్వహించడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా సీఎం పర్యటనలో అలసిపోయిన తర్వాత మళ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం సరికాదని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. సీఎం పర్యటన ఖరారైనప్పటి నుంచి కలెక్టర్, ఎస్పీతోపాటు అన్ని శాఖల అధికారులు వారం రోజులుగా కుప్పంలోనే తిష్టవేశారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ ఇప్పటి వరకు జరిగిన పనులు, అవసరమైనవి, పూర్తి చేయవలసినవి, అవసరమైన నిధులపై నివేదికలు సిద్ధం చేశారు. సోమవారం మధ్యాహ్నం కుప్పానికి చేరుకున్న సీఎం చంద్రబాబు మొదటి రోజు కార్యక్రమాలన్నీ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి అయ్యింది. మరుసటి రోజు మంగళవారం సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అన్నీ ముగించుకుని రాత్రి 10 గంటలకు ద్రవిడ యూనివర్సిటీలోని సెమినార్ హాలుకి చేరుకుని అధికారులతో సమీక్ష సమా వేశం ప్రారంభించారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం రాత్రి 7.30 గంటలకు సమీక్ష పూర్తి కావాల్సి ఉంది. కానీ, రాత్రి 10 తర్వాత ప్రారంభమైన సమావేశం 12.20 గంటల వరకు సాగింది.
సీఎం చంద్రబాబు తీరుతో అధికారుల అవస్థలు
అర్ధరాత్రి వరకు సమావేశాలపై ఆవేదన
ఇవేం కష్టాలు బాబోయ్!
ముఖ్యమంత్రి సమావేశానికి సీనియర్ అధికారులు, పిల్లలు ఉన్న తల్లులు హాజరైనట్లు తెలిసింది. రాత్రి 7.30 గంటలకు మీటింగ్ ముగుస్తుందని, ఇళ్లకు వెళ్లిపోవచ్చని భావించారు. అయితే అర్ధరాత్రి దాటే వరకు సమావేశం కొనసాగించడంతో పలువురు అధికారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బుధ వారం ఎటువంటి కార్యక్రమాలు లేకపోయి నా ఎక్కువ మంది అధికారులు ప్రొటోకాల్ ప్రకారం సీఎం చంద్రబాబు బయలుదేరే సమయం వరకు కుప్పంలోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇవేం కష్టాలు బాబోయ్ అని అధికారులు చర్చించుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment