కుంకీలతో భీకరి కట్టడి? | - | Sakshi
Sakshi News home page

కుంకీలతో భీకరి కట్టడి?

Published Sat, Jan 25 2025 12:54 AM | Last Updated on Sat, Jan 25 2025 12:54 AM

కుంకీ

కుంకీలతో భీకరి కట్టడి?

కౌండిన్య అభయారణ్య సమీపంలోని పల్లెవాసులను దశాబ్దాలుగా ఏనుగుల సమస్య వేధిస్తోంది. అడవిని దాటి వస్తున్న గజరాజులు పంటలను నాశనం చేస్తుండడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. భ్ఙీకరిశ్రీ కట్టడికి అటవీశాఖ ఏర్పాటు చేసిన సోలార్‌ ఫెన్సింగ్‌ నిరుపయోగంగా మారిపోతోంది. కందకాలు సైతం ఫలితం ఇవ్వని పరిస్థితి తలెత్తింది. కర్ణాటక తరహాలో చేపట్టిన హ్యాంగింగ్‌ సిస్టమ్‌ కూడా ప్రయోగంగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా గజబీభత్సానికి చెక్‌ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పలమనేరు మండలం మొసలిమడుగు వద్ద ఎలిఫెంట్‌ ప్రాజెక్టు చేపడుతోంది. అయితే రామకుప్పం మండలం ననియాలలో ఇదే విధంగా గతంలో ఏర్పాటు చేసిన క్యాంపు ఓ వైఫల్యంగా నిలిచిపోయింది. అందులోని కుంకీ కనీసం ఒక్క ఏనుగును కూడా అదుపు చేయలేని దుస్థితి ప్రత్యక్ష నిదర్శనంగా మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆదే పునరావృతమవుతుందేమో అనే అనుమానం రైతుల్లో వ్యక్తమవుతోంది.

పలమనేరు : కుప్పం, పలమనేరు పరిధిలోని కౌండిన్య అభయారణ్యం 250 కిలోమీటర్ల మేర మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లో సుమారు 120 ఏనుగులుఉన్నాయి. 1984లో మొసలిమడుగు వద్ద కౌండిన్య ఎలిఫెంట్‌ సంరక్షణ కేంద్ర ఏర్పాటు చేశారు. ఇందులోకి మోర్థన ఫారెస్ట్‌తోపాటు కర్ణాటకలోని బన్నేరుగట్ట, బంగారుపేట, కేజీఎఫ్‌, తమిళనాడులోని కృష్ణగిరి, హోసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి కౌండిన్యలోకి తరచూ ఏనుగులు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే గజరాజులు అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు బంగారుపాళ్యం మండలం నుంచి కుప్పం వరకు 142 కిలోమీటర్ల మేర సోలార్‌ఫెన్సింగ్‌, 40 కిలోమీటర్ల మేర ట్రెంచ్‌లు రూ.2.61కోట్లతో గఏర్పాటు చేశారు.

గతంలో చేపట్టిన పనులు విఫలం

సోలార్‌ఫెన్సింగ్‌ను ఏనుగులు తొక్కి అడవిలోంచి బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఫెన్సింగ్‌ కోసం ఏర్పాటు చేసిన కమ్మీలు నాసిరకంగా ఉండడంతో వీటిని సులభంగా విరిచేస్తున్నాయి. దీనికి తోడు దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన సోలార్‌కు బ్యాటరీలు పనిచేయక చాలాచోట్ల కరెంట్‌ షాక్‌ కొట్టడం లేదు. ఇక ఎలిఫెంట్‌ ట్రెంచ్‌లను సైతం ఏనుగులు మట్టిని తోసి బయటికొస్తున్నాయి. ఈ రెండు ఫెయిల్‌ కావడంతో గత ఏడాది కర్ణాటక మోడల్‌ పేరిట హ్యాంగింగ్‌ సోలార్‌ను పది కిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా చేపట్టి ఆపై అలాగే వదిలేశారు.

కర్ణాటక నుంచి కుంకీలు!

కూటమి ప్రభుత్వం కర్ణాటక సర్కారుతో ఎంఓయూ చేసుకొని అక్కడ శిక్షణపొందిన నాలుగు కుంకీ ఏనుగులకు ఇక్కడికి తెప్పిస్తామంటోంది. ఇందుకోసం రేంజి పరిధిలోని 20మంది ఎలిఫెంట్‌ ట్రాకర్లను దుబారే ఎలిఫెంట్‌ క్యాంపునకు పంపి నెలరోజుల పాటు శిక్షణ ఇప్పించింది. ఆమేరకు పలమనేరు మండలంలోని ముసలిమొడుగు వద్ద రూ.12లక్షల వ్యయంతో కుంకీ ఎలిఫెంట్‌ క్యాంపును 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. వీటికోసం పనిచేసే మహోత్సవ్‌, వావడిల నివాసాలు నిర్మించాలని నిర్ణయించింది. మరో రూ.27లక్షలతో హ్యాంగింగ్‌ సోలార్‌ను ఏర్పాటు చేయనుంది. ఇదిలా ఉండగా, గతంతో రామకుప్పం వద్ద ననియాలలో ఏర్పాటు చేసిన ఇలాంటి క్యాంపులో రెండు ఏనుగులున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు వెళుతున్నారేగానీ ఇవి అడవిలోని ఏనుగులను కట్టడి చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. అదే రీతిలో ఇక్కడ కుంకీలతో సమస్య తెగుతుందా? లేదా అనే సందేహం మాత్రం ఇక్కడి రైతులకు పట్టుకుంది. అసలే ఇక్కడున్న మదపుటేనుగులు తమ ఎదుట పడిన కుంకీ ఏనుగులపై దాడులు చేసే అవకాశం లేకపోలేదు.

కౌండిన్యలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు (ఫైల్‌)

కట్టడి సాధ్యమే

పలమనేరులో కుంకీ ఎలిఫెంట్‌ క్యాంపు కోసం ఇప్పటికే పనులు సాగుతున్నాయి. ఆ మేరకు మైసూరు సమీపంలోని దుబారే నుంచి నాలుగు కుంకీ ఏనుగులు త్వరలో రానున్నాయి. ఎలిఫెంట్‌ ట్రాకర్లకు ఇప్పటికే కుంకీ ట్రైనింగ్‌ ఇప్పించాం. ముఖ్యంగా మదపుటేనుగులు దాడులు చేయకుండా వాటికి శిక్షణనిస్తాం. దీంతో ఏనుగులను కట్టడి చేసే అవకాశం ఉంటుంది.

– భరణి, డీఎఫ్‌ఓ, చిత్తూరు

సమస్య తీరితే చాలు

గతంలో ఏనుగులను కట్టడి చేసేందుకు చేసిన పనులన్నీ లాభం లేకుండా పోయాయి. ఇప్పుడు కుంకీ ఏనుగులంటున్నారు. వీటితోనైనా ఇక్కడ ఏనుగుల సమస్య పరిష్కారమైతే అదే పదివేలు. అయినా జనంపై దాడులు చేస్తూ,పంటపొలాలపై పడుతున్న మదపుటేనుగులను ఈ కుంకీలు ఎంతవరకు అదుపు చేస్తాయనే అనుమానం కూడా ఉంది.

– ఉమాపతి, రైతు సంఘం నేత, పలమనేరు

No comments yet. Be the first to comment!
Add a comment
కుంకీలతో భీకరి కట్టడి?1
1/5

కుంకీలతో భీకరి కట్టడి?

కుంకీలతో భీకరి కట్టడి?2
2/5

కుంకీలతో భీకరి కట్టడి?

కుంకీలతో భీకరి కట్టడి?3
3/5

కుంకీలతో భీకరి కట్టడి?

కుంకీలతో భీకరి కట్టడి?4
4/5

కుంకీలతో భీకరి కట్టడి?

కుంకీలతో భీకరి కట్టడి?5
5/5

కుంకీలతో భీకరి కట్టడి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement