● పలు వ్యాపారాల్లో కూటమి నేతల సిండికేట్ ● యథేచ్ఛగా అక్
అగ్గిపుల్ల..సబ్బు బిళ్ల కాదేదీ అనర్హం అక్రమ రవాణాకు అన్న చందంగా పలమనేరు
కేంద్రంగా రేషన్ బియ్యం మొదలుకుని పర్మిట్ లేని గ్రానైట్ వరకు అన్ని అక్రమ వ్యాపారాల్లో కూటమి నేతలు
అక్రమార్కులతో సిండికేట్ అయ్యారు. ఈ అక్రమ‘కూటమి’ దెబ్బకు ఆయా శాఖల
అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు
వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పలు ప్రకృతి వనరులతోపాటు మరిని అక్రమవ్యాపారాలు మూడుపువ్వులు ఆరుకాయలుగా
సాగుతున్నాయి.
కర్ణాటకకు యథేచ్ఛగా తరలుతున్న రేషన్ బియ్యం (ఫైల్)
సాక్షి, టాస్క్‌ఫోర్స్: పలమనేరు.. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు. దీంతో పలమనేరు కేంద్రంగా పలు అక్రమ వ్యాపారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మొన్నటివరకు అక్రమార్కుల ఆటలు సాగనీయకుండా సంబంధిత అధికారులతో అక్రమార్కులకు కూటమి నేతలు ముకుతాడు వేయించారు. ఆపై స్మగర్లతోనే మిలాఖత్ అయి, మీకెంత.. మాకెంత? అని డీల్ కుదుర్చుకున్నారు. సిండికేట్‌లో భాగస్వాములయ్యారు. దీంతో పలమనేరు కేంద్రంగా అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నారు. కూటమి నేతలు భాగస్వాములు కావడంతో సంబంధిత అధికారులు అక్రమాలను చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు.
అక్రమ వ్యాపారాల్లో కూటమి నేతల భాగస్వామ్యం
పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు చోట్ల నుంచి ప్రజలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని కర్ణాటకలోని బంగారుపేటకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కన్నేసిన ఎమ్మెల్యేకు అన్నీతానేనంటూ చెప్పుకుంటున్న ఓ యువకుడు బియ్యం స్మగర్లతో డీల్ చేసుకుని అతని సారథ్యంలో బియ్యం అక్రమ రవాణా చేయిస్తున్నట్టు సమాచారం. అలాగే పట్టణంలో సాగే లాటరీ వ్యవహారాల్లో తమిళనాడుకు చెందిన ముగ్గురు ఈ ప్రాంతంలో కీలకంగా మారి గతంలో సంబంధిత శాఖలకు మామూళ్లు ఇస్తూ లాటరీలు నిర్వహించేవారు. ఇప్పుడు పచ్చపార్టీకి చెందిన ఓ యువనేత ఇందులో కీలక భాగస్వామిగా మారి దందా చేయిస్తున్నట్టు సమాచారం. ఇక పుంగనూరు, పెద్దపంజాణిలోని రాయలపేట నుంచి నిత్యం నాలుగైదు లోడ్ల పశువులను తమిళనాడులోని కబేళాలకు పట్టపగలే తరలిస్తున్నారు. ఈ విషయం పోలీసుల కళ్ల ముందే సాగుతోంది. అయితే ఇక్కడి ఓ కీలక నేత పశువుల అక్రమరవాణాను లీడ్ తీసుకొని నడిపిస్తున్నట్టు తెలిసింది. పొరుగునే ఉన్న తమిళనాడుకు అక్కడి కూటమి నేతలు స్మగర్లతో సిండికేట్‌గా ఏర్పడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక పర్మిట్లు లేని గ్రానైట్ అక్రమరవాణా సాగిస్తున్నారు. మైనింగ్ అధికారులకు తెలిసినా వారు కిమ్మనకుండా వదిలేసినట్టు తెలిసింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ సెటిల్‌మెంట్లకు సంబంధించి పచ్చనేతల ఆధ్వర్యంలో జోరుగా సాగుతోంది. ఆయా ఎమ్మెల్యేల పేరు చెప్పి రెవెన్యూ అధికారులతో వీరు దందాలను సాగిస్తున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సైతం కూటమి నేతలు తమ గుప్పిట్లోకి తీసేసుకున్నారు. ఇప్పుడు అడుగు స్థలంపై ఎంత ధర నిర్ణయించాల్లో కూటమికి చెందిన రియల్టర్లు నిర్ణయిస్తున్నారు. చివరకు చికెన్ ధరల నిర్ణయంలోనూ కూటమి సిండికేట్‌లే నిర్ణయించి భారీగా దోపిడీకి పాల్పడుతున్న చికెన్ చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిమ్మకు నీరెత్తిన చందంగా అధికారులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమినేతలే స్మగ్లర్లతో కలిసి అక్రమ వ్యాపారాలు చేస్తుండడంతో ఆయా శాఖల అధికారులు సైతం మీరేమన్నా చేసుకోండి మాకు సంబంధం లేదనట్టు వ్యవహరిస్తున్నారు. వీరిలో ఎవరైనా నిజాయితీ కలిగిన అధికారి ఈ అక్రమాలను ప్రశ్నిస్తే అతనికి బదిలీలు తప్పవనేమాట ఇక్కడ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment