![అగ్రతాంబూలం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10ctr11-300005_mr-1739218245-0.jpg.webp?itok=TCG-UkJC)
అగ్రతాంబూలం
తమ్ముళ్లకే
పచ్చనేతల మధ్యనే పోటీ..
ఇక చైర్మన్ పోస్టుల్లో ఈసారి కూడా జనసేన, బీజేపీ నేతలకు రిక్తహస్తం తప్పేలాలేదు. ఇప్పటికే భర్తీ చేసిన పలు నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీ మిత్రధర్మాన్ని పాటించకుండా ఏకపక్షంగా తమ పార్టీ నేతలకే పదవులు కట్టబెట్టినట్లు కూటమిలోని ఇతర పార్టీలు అరిచి గగ్గోలు పెడుతున్నాయి. అయినా సరే మా దారి మాదే అన్నట్లు మార్కెట్ కమిటీల్లోనూ తమ్ముళ్లకే అగ్రపీఠం వేయనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు చిత్తూరు కమిటీ చైర్మన్ పదవిని ఎమ్మెల్యే వర్గం వెంకటేష్ యాదవ్‌కు ఇవ్వాలని నిర్ణయించగా, దీన్ని వ్యతిరేకించిన మరోవర్గం బీసీ మహిళకు రిజర్వు చేయించినట్లు చెబుతున్నారు. బంగారుపాళెం చైర్మన్ కుర్చీపై ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య పోటీ నడుస్తున్నట్లు సమాచారం. పెనుమూరు చైర్మన్ పోస్టుకు ఎమ్మెల్యే ఓ వ్యక్తి పేరు ఖరారు చేయగా, ఎస్‌ఆర్ పురం మార్కెట్ చైర్మన్ మాత్రం పాలసముద్రానికి చెందిన మరో టీడీపీ నేత తన అనుచరుడికి పోస్టు ఇప్పించడానికి చినబాబు వద్ద నేరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కుప్పం స్థానానికి గుడుపల్లె, శాంతిపురానికి మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్లతో సహా ఆరుగురు పోటీపడుతున్నారు.
చిత్తూరు అర్బన్: జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. ఏడు నియోజకవర్గాల్లోని పది మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానాల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక సైతం అందజేసినట్లు తెలుస్తోంది. ఆదాయం ఉన్న పెనుమూరు, బంగారుపాళెం, చిత్తూరు, కుప్పం లాంటి ఆర్థికంగా బలమైన స్థానాలకు నువ్వా–నేనా అన్నట్లు పోటీ నెలకొంది. ఈ పోటీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు సృష్టిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీలో ఈసారి కూడా జనసే, బీజేపీ నేతలను దూరం పెట్టి.. తమ్ముళ్లకే అగ్ర తాంబూలం ఇవ్వడానికి సర్వం సిద్ధం చేశారు.
రిజర్వేషన్లు ఇలా..
మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టుల్లో గతేడాది డిసెంబర్‌లో తొలుత కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందులో చిత్తూరు, పుంగనూరు బీసీ–జనరల్, కుప్పం, పలమనేరు బీసీ–మహిళ, సోమల ఎస్సీ మహిళ, ఎస్‌ఆర్ పురం ఎస్సీ జనరల్, రొంపిచెర్ల, నగరి ఓసీ మహిళ, పెనుమూరు, బంగారుపాళెం ఓసీ జనరల్‌కు రిజర్వు చేసినట్లు సమాచారం. అయితే రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాత, కూటమి నేతలు జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో గతనెల మళ్లీ మరోసారి రిజర్వేషన్లు మారినట్లు సమాచారం. ఇందులో చిత్తూరును బీసీ మహిళ, కుప్పం బీసీ జనరల్‌కు మార్పు చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
జిల్లాలో పూర్తయిన మార్కెట్ చైర్మన్ రిజర్వేషన్లు
పట్టుపట్టి కుప్పం, చిత్తూరు చైర్మన్ స్థానాల మార్పు?
బీజేపీ, జనసేనకు రిక్తహస్తం? తమ్ముళ్ల మధ్యే పోటీ
ఎంపీ, ఎమ్మెల్యేల అనుచరుల మధ్య పోటీ తీవ్రతరం
నెలాఖరులోపు పేర్లు వెల్లడించనున్న కూటమి ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment