![‘గీత’ కులాలనూ వదల్లేదు!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10ctr13-300005_mr-1739218245-0.jpg.webp?itok=aOzYH4Hp)
‘గీత’ కులాలనూ వదల్లేదు!
చిత్తూరు అర్బన్: గీత కులాలకు రిజర్వు చేసిన మద్యం దుకాణాలనూ టీడీపీ నేతలు వదల్లేదు. పలుచోట్ల బినామీల ద్వారా దుకాణాలు దక్కించుకుని.. ఆ సామాజికవర్గాల్లోని నిజమైన వర్గాల కడపు కొట్టారు. జిల్లాలో గీత కులాలకు 50 శాతం రాయితీతో మద్యం దుకాణాలను కేటాయించడానికి గతనెల అధికారులు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం పది మద్యం దుకాణాలకు 79 దరఖాస్తులు రాగా, సోమవారం చిత్తూరులోని కలెక్టరేట్‌లో వీటిని లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు జరిగింది. చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్ డిప్ ద్వారా దుకాణాల లైసెన్సులు వచ్చిన వాళ్లను నిర్ణయించారు. ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్, ఈఎస్ శ్రీనివాస్, సీఐలు శ్రీహరిరెడ్డి, పురుషోత్తం తదితరుల సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. గీత కులాలకు మద్యం దుకాణాల కేటాయింపునకు గౌడ, గౌండ్ల, గౌడ్, ఈడిగ ఉప కులాల నుంచి మొత్తం 79 దరఖాస్తులు రాగా, పెద్దపంజాణి దుకాణాన్ని గౌండ్లకు కేటాయించడంతో అక్కడ ఒకే ఒక్క దరఖాస్తు వచ్చింది. పోటీ లేకపోవడంతో అతనికే దుకాణం అనుకున్న తరుణంలో.. లాటరీ ప్రక్రియ జరిగిన సమయంలో సంబంధిత వ్యక్తి గౌండ్ల కాదని తహసీల్దార్ వివరణ ఇచ్చారు. దీంతో ఆ దుకాణానికి వచ్చిన టెండరును రద్దు చేసి, తదుపరి నిర్ణయం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇక దుకాణాలు దక్కించుకున్న తొమ్మిది మంది లైసెన్సుదారులు మంగళవారం నుంచే వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. గీత సంఘాలకు లైసెన్సు ఫీజులో 50 శాతం రాయితీ ఉండడం, నిర్ణీత ప్రదేశంలో ఎక్కడైనా దుకాణం పెట్టుకోవచ్చనే వెలుసుబాటు ఉండడంతో అన్–రిజర్వు కింద దుకాణాలు దక్కించుకున్న కూటమి నేతల్లో ఆందోళన నెలకొంది.
బినామీలతో దుకాణాలు దక్కించుకున్న నేతలు
పెద్ద పంజాణిలో గౌండ్ల లేకపోవడంతో రద్దు
ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు
మొదలైన బెదిరింపులు
లక్కీ డిప్‌లో ఎస్‌ఆర్.పురం మండలం పాతపాళేనికి చెందిన అలేఖ్య అనే మహిళకు పాలసముద్రం మద్యం షాపు దక్కింది. దరఖాస్తు సమయంలో అదే మండలానికి చెందిన రమేష్ రెడ్డి, మునికృష్ణా రెడ్డి అనే వ్యక్తుల వద్ద తాను కొద్ది మొత్తం అప్పు తీసుకున్నానని, అయితే లక్కీ డిప్‌లో షాపు వచ్చిన తర్వాత వీరిద్దరూ తనను బెదిరిస్తున్నారంటూ బాధిత మహిళ సోమవారం రాత్రి చిత్తూరు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేస్తానని చెబుతున్న తమకు డబ్బు వద్దని దుకాణమే కావాలని బెదిరిస్తున్నారని, అసభ్యంగా మాట్లాడుతున్నారని మహిళ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment