ఆర్టీసీలో సమయ పాలనకు ప్రాధాన్యం
అమలాపురం రూరల్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ సమయ పాలనకు ప్రాధాన్యం ఇస్తుందని జిల్లా ప్రజా రవాణాధికారి ఎం.శ్రీనివాసరావు అన్నారు. శనివారం నెల రోజుల పాటు జరిగే సమయ పాలన మాసోత్సవాలను శనివారం ఆయన ప్రారంభించారు. అమలాపురం డిపో గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు పలు అంశాలు వివరించారు. బస్సులు సమయ పాలనకు వెళ్లడం ద్వారా ప్రయాణికులు సంతృప్తి చెంది సంస్థ ఆదాయం పెరుగుతుందన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు తమ విధులను సకాలంలో నిర్వహించాలన్నారు. బస్టాండ్ నుంచి బస్సులు టైమ్‌కు బయలు దేరడం, సకాలంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం చేయాలన్నారు. గ్యారేజ్ సిబ్బంది బస్సులు మంచి కండిషన్‌లో ఉండేలా చూడాలన్నారు. ప్రతి నెలా మొదటి వారంలో డ్రైవర్ల సంతోషకార వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, మొదటి మూడు రోజులు ప్రతి డ్రైవర్‌తో చర్చించి బస్సుల్లో లోపాలను తెలుసుకొని మిగిలిన నాలుగు రోజుల్లో వాటిని సరిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణ మూర్తి, ట్రాఫిక్ ఇన్‌చార్జి ప్రతిమాకుమారి, గ్యారేజ్ ఇన్‌చార్జి దేవి, ఓపీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఎన్. వరహాలబాబు తదితరులు పాల్గొన్నారు.
రత్నగిరి కిటకిట
అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధికి భక్తులు ఉదయం నుంచీ తండోపతండాలుగా వచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలు భక్తులతో నిండిపోయాయి. సాయంత్రం నాలుగు గంటల వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు 4,800 జరిగాయి. స్వామివారి నిత్య కల్యాణంలో రూ.1,116 చొప్పున టికెట్లు కొనుగోలు చేసి 27 మంది భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment