పొట్టేళ్ల బండి.. పరుగెత్తిందండి
అంబాజీపేట: జోడెడ్ల బండిని చూశాం.. గుర్రపు బగ్గీని చూశాం.. ఒంటె బండి లాగుతున్నదీ చూశాం. కానీ పొట్టేళ్ల బండి లాగడం అంటే ఆశ్చర్యమే కదా. రెండు పొట్టేళ్లకు బండిని తయారు చేయించి సవారీ చేస్తున్న దృశ్యం పలువురిని అబ్బురపరస్తుంది. వివరాల్లోకి వెళితే అంబాజీపేటకు చెందిన యర్రంశెట్టి శ్రీను కారు మెకానిక్, గ్యారేజ్‌ను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆ వృత్తితో పాటు పశువులు, వ్యవసాయం అంటే ఎంతో మక్కువతో వివిధ రకాల జాతి ఆవులు, పొట్టి ఆవులు, గొర్రెలు, కుక్కలను ప్రేమతో పెంచుతున్నాడు. ఐదు నెలల క్రితం రెండు పొట్టేళ్లను శ్రీశైలంలో రూ.25 వేలకు కొనుగోలు చేశానని, ఈ పొట్టేళ్ల జోడికి బండి కట్టాలని ఆలోచన వచ్చిందన్నారు. దాంతో రూ.30 వేలు వెచ్చించి తనకున్న ఆలోచనలకు తగినట్లుగా బండిని తయారు చేయించానన్నాడు. ఈ పొట్టేళ్లకు బండి కట్టి శిక్షణ ఇస్తున్నాడు. సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి పొట్టేళ్లపై బండిపై సవారీ చేయడం తన లక్ష్యమని శ్రీను తెలిపాడు.
‘పెద్దింటి’కి విశ్వగురు
కామధేను పురస్కారం
కొత్తపేట: వివిధ ప్రయోగాలతో తన ప్రత్యేకతను చాటుకుంటున్న బహుముఖ ప్రజ్ఞాశాలి పెద్దింటి రామచంద్ర శ్రీహరి (రామం)కు విశ్వగురు కామధేను పురస్కారాన్ని ప్రదానం చేశారు. కొత్తపేటకు చెందిన రామం తన ప్రయోగాలు, వివిధ అరుదైన సేకరణలు, సేవల ద్వారా 100 రికార్డులు, 16 అవార్డులు, గౌరవ డాక్టరేట్ పొందారు. తాజాగా విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో వివిధ రంగాల నుంచి పలువురు ప్రముఖులతో పాటు రామంను కామధేను పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజా వద్ద పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రామంను తెలంగాణ హైకోర్టు జడ్జి సూర్యేపల్లి నంద చేతుల మీదుగా అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన్ని విశ్వగురు సంస్థ చైర్మన్ సత్యవోలు రాంబాబు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ చైర్మన్ డాక్టర్ చింతపట్ల వెంకటాచారి, ప్రముఖ సినీ నటులు పృథ్వీరాజ్, జోగినాయుడు తదితర అభినందించారు.
ఆర్టీసీ కండక్టర్‌కు
జాతీయ అవార్డులు
గోపాలపురం: మండలంలోని వేళ్లచింతలగూడెం గ్రామానికి చెందిన కౌలూరి ప్రసాదరావు మహాత్మా జ్యోతిరావు ఫైలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫెలోషిప్ అవార్డులు అందుకున్నారు. న్యూఢిల్లీలోని పంచశీల ఆశ్రమంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయనకు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.సుమనాక్షర్ ఆధ్వర్యాన కేంద్ర మాజీ మంత్రి, ఏపీ మాజీ గవర్నర్ సుశీల్‌కుమార్ షిండే అవార్డులు అందజేశారు. ప్రసాదరావు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నారు.
ట్రాక్టర్ ఢీకొని తల్లీకూతుళ్ల మృతి
గోపాలపురం: వేగంగా దూసుకువచ్చిన ట్రాక్టరే వారి పాలిట మృత్యుశకటమైంది. మండలంలోని దొండపూడి గ్రామ శివార్లలో ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు తల్లీకూతుళ్లు ఆదివారం మృతి చెందారు. ఎస్సై కర్రి సతీష్ కుమార్ కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా పోలవరం మండలం బక్కబండ్లగూడెం గ్రామానికి చెందిన కురసాని కాంతమ్మ (45), ఆమె తల్లి కవలం గన్నెమ్మ (72) కలసి గోపాలపురం మండలం దొండపూడికి స్కూటీపై వచ్చారు. పనులు ముగించుకొని తిరిగి వెళుతుండగా గ్రామ శివార్లలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వారిని బలంగా ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లను 108లో రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. మృతురాలు కాంతమ్మ బక్కబండ్లగూడెంలో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment