ఎన్‌ఎంఎంఎస్ పరీక్షల్లో ప్రతిభ చూపాలి
అమలాపురం టౌన్: నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్ షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ చూపి కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక చేయూతకు అర్హులు కావాలని డీఈఓ షేక్ సలీమ్ బాషా ఆకాంక్షించారు. ఆదివారం డివిజన్‌కు సంబంధించి అమలాపురంలో ఏర్పాటు చేసిన ఆరు కేంద్రాల్లో 8వ తరగతి విద్యార్థులు పరీక్ష రాశారు. అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అంతకు ముందు పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులను ఉద్ధేశించి డీఈఓ మాట్లాడారు. పరీక్షకు క్రమశిక్షణతో సహకారం అందించిన ఎన్‌సీసీ విద్యార్థులను అభినందించారు. ఎన్‌ఎంఎంఎస్ పరీక్షల స్క్వాడ్ అధికారి, అమలాపురం డివిజన్ విద్యా శాఖాధికారి (డీవైఈఓ) గుబ్బల సూర్యప్రకాశం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. అమలాపురంలోని కొంకాపల్లి జవహర్‌లాల్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, వెత్సావారి అగ్రహారం మహత్మాగాంఽధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, విద్యానిధి స్కూల్, రూరల్ మండలం పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు డీవైఈఓ తెలిపారు. అమలాపురం డివిజన్‌లో మొత్తం 1,239 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1,156 మంది హాజరయ్యారని చెప్పారు. హెచ్‌ఎంలు ఎస్.రాజరాజేశ్వరి, విజయకుమారి, కె.ఘన సత్యనారాయణ, బీఆర్ కామేశ్వరరావు, శ్రీనివాసరావులు ఆయా పరీక్ష కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించారు.
జిల్లాలో ప్రశాంతంగా పరీక్ష
రాయవరం: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ అర్హతకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 13 కేంద్రాల్లో 2,815 మందికి 2,688 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు.
నేడు యథావిధిగా గ్రీవెన్స్
అమలాపురం రూరల్: జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్ గోదావరి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి అర్జీదారులు వచ్చి తమ సమస్యలను తెలిపి పరిష్కార మార్గాలు పొందాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయితో పాటు డివిజన్, మండల స్థాయిల్లోనూ ఈ కార్యక్రమం జరుతుందని కలెక్టర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment