అభీష్ట సిద్ధి.. అనుగ్రహ ప్రాప్తి..
సఖినేటిపల్లి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి నొందిన అంతర్వేది పుణ్యక్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. నవ బుధవార నవ ప్రదక్షిణ దీక్ష చేసి శ్రీనారసింహ సుదర్శన హోమం చేయించుకోవడం ద్వారా తమ సకల అభీష్టాలు, సర్వ కార్యాలు నెరవేరుతాయని నమ్ముతారు. క్షేత్రంలో స్వయం భూ గా లక్ష్మీనసింహస్వామి వెలిసినట్టు చరిత్ర చెబుతోంది. వశిష్ట మహర్షి ప్రార్థన కారణంగా ఇక్కడ స్వామి పశ్చిమ ముఖంగా వేంచేసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్వామివారి సన్నిధిలో అత్యంత పురాతనమైన 16 ఆయుధములు, 16 భుజములు కలిగిన సుదర్శన చక్రధారుడైన లక్ష్మీనరసింహస్వామికి (శ్రీసుదర్శన పెరుమాళ్) నిత్యం సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. భక్తుల మనోవాంఛా ఫలసిద్ధికి, సర్వగ్రహ దోష నివారణకు, లోక కల్యాణార్థం ఈ హోమం అత్యంత శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు నిర్వహిస్తున్నారు.
2010 నుంచి...
స్వామివారి సన్నిధిలో నిత్య శ్రీసుదర్శన హోమం ప్రారంభించక పూర్వం భక్తులు సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ సొంతంగా వెచ్చించి ప్రత్యేకంగా సుదర్శన హోమం నిర్వహించుకునేవారు. అయితే కాలక్రమంలో భక్తులందరికీ సుదర్శన హోమంలో పాల్గొనే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది సమాలోచన చేసి, నిత్య శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించుకునేందుకు నిర్ణయించారు. ఇందుకు విధి విధానాలు రూపొందించాక 2010 సంవత్సరంలో హోమం ప్రారంభించారు. దశాబ్దన్నర కాలంగా నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు.
వీక్షించిన మహాస్వామి : అంతర్వేది లక్ష్మీనృసింహుని దర్శనానికి ఇటీవల విచ్చేసిన శృంగేరీ పీఠాధిపతి విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న సుదర్శన హోమం వీక్షించారు. హోమం నిర్వహణ, ఇతర అంశాల గురించి ఆలయ ప్రధాన అర్చకుడు కిరణ్.. భారతీ మహాస్వామికి వివరించారు.
లోక కల్యాణార్థం
శ్రీ నారసింహ సుదర్శన హోమం
2010 నుంచి అంతర్వేదిలో నిత్యం నిర్వహణ
16 ఆయుధాలు,
16 భుజాలు కలిగిన స్వామి
నవ బుధవార, నవ ప్రదక్షిణ దీక్ష
నిర్వహిస్తున్న భక్తులు
రూ.కోటి ఏడు లక్షల ఎఫ్‌డీలు
అంతర్వేది దేవస్థానంలో శ్రీనారసింహ సుదర్శన హోమంలో స్వామివారి శాశ్వత పూజల నిమిత్తం భక్తుల నుంచి ఇంత వరకూ రూ.ఒక కోటి ఏడు లక్షల ఆదాయం సమకూరింది. ఈ ఆదాయాన్ని బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో భద్రపరిచాం.
– వి.సత్యనారాయణ, అసిస్టెంట్ కమిషనర్, అంతర్వేది దేవస్థానం
భక్తుల మనోవాంఛా ఫలసిద్ధి
భక్తులు శ్రీనారసింహ సుదర్శన హోమం నిర్వహించుకోవడం ద్వారా మనోవాంఛా ఫలసిద్ధి కలుగుతుంది. సర్వగ్రహ దోష నివారణ, లోక కల్యాణం సుదర్శన హోమంలో పూజల వల్ల సిద్ధిస్తుంది.
– పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, ప్రధాన అర్చకుడు, అంతర్వేది దేవస్థానం
Comments
Please login to add a commentAdd a comment