● జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు
● బ్రిడ్జిలకు 500 మీటర్ల లోపు
ఇసుక తవ్వితే చర్యలు
● బోట్స్‌మెన్ సభ్యులపై
క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)/కొవ్వూరు: నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు కం రైలు వంతెనకు సమీపంలో సోమవారం ఇసుక తవ్వకాలు చేస్తున్న 18 బోట్లను సీజ్ చేసినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు ప్రకటించారు. కొవ్వూరు ఏరినమ్మ ఘాట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొవ్వూరు ఏరినమ్మ, ఔరంగబాద్–1 ఇసుక ర్యాంపులకు చెందిన పది, రాజమహేంద్రవరం దోభీఘాట్‌లో 8 బోట్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. బ్రిడ్జిలకు 500 మీటర్ల దూరంలో ఏవిధమైన తవ్వకాలు చేపట్టకూడదనే నిబంధన ఉంది. తెల్లవారు జూమునుంచే పడవల సాయంతో రోజూ ఇసుక త్వవకాలు చేస్తున్నారని జేసీ తెలిపారు. మైనింగ్, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు, టాస్క్‌ఫోర్సు సహకారంతో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్న బోట్లను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. బోట్ల నిర్వాహకులు తెలిసే ఈ తవ్వకాలు చేస్తున్నట్టు తమ విచారణలో వెల్లడైందన్నారు. బోట్లను సీజ్ చేయడమే కాకుండా యజమానుల పైన, బోట్స్‌మెన్ సొసైటీ సభ్యులపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొవ్వూరులో సీజ్ చేసిన పది బోట్లను గోష్పాదక్షేత్రం లోని బోట్‌పాయింట్ వద్ద భద్రపరిచినట్లు ఏజీఆర్‌బీ డీఈఈ కె.ఆనంద్‌బాబు తెలిపారు. మైనింగ్ ఏడీ ఫణి భూషణ్‌రెడ్డి, ఏజీఆర్‌బీ ఏఈ జి.మణికంఠరాజు, టాస్క్‌ఫోర్సు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment