ఉత్సాహంగా సంస్కృతి ఉత్సవ్ పోటీలు
అమలాపురం టౌన్: స్థానిక యర్రమిల్లి వారి వీధిలోని హనుమాన్ మందిర్ వద్ద ఆకొండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతి ఉత్సవ్ పోటీలు సోమవారం ఉత్సాహంగా మొదలయ్యాయి. సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవ్ పోటీలు 9 విభాగాల్లో జిల్లా స్థాయిలోనూ, 5 విభాగాల్లో ఇంటర్‌నెట్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలోనూ జరుగుతున్నాయి. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని మన సంస్కృతిని ప్రతిబింబించే అంశాలను ప్రదర్శించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి మరీ ఈ పోటీల్లో పాల్గొని మన సంస్కృతికి అద్దం పట్టారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకూ చదివేవారు పోటీల్లో పాల్గొన్నారు. భగవద్గీత, మట్టితో బొమ్మలు చేయడం, కథలు చెప్పడం, జానపద నృత్యాలు, సంస్కతీ సంప్రదాయాలకు నిలయంగా వ్యాసరచన పోటీలు తొలి రోజు జరిగాయి. మయూరం పేరుతో చిత్రకారుడు ముద్దు రమేష్ ఏర్పాటు చేసిన డిజిటల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ విద్యార్థులు, సందర్శకులను విశేషంగా అకట్టుకుంది. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సంస్కార భారతి రాష్ట్ర మహిళా ప్రముఖ్ వేదనభట్ల సాయిలక్ష్మి, లారెన్స్ మాస్ట్‌ర్ శిష్యుడు ధనరాజ్, ఆకొండి ధన్వంతరి, దేవపూజ్యల నాగమణి, ఓరుగంటి అగ్నిహోత్ర శర్మ వ్యవహరించారు. భారతం, రామాయణం తదితర పురాణ ఇతిహాసాలు, భారతీయ విజ్ఞాన వైభవం వంటి అంశాల్లో వ్యాస రచన పోటీలు జరిగాయి. ఆకొండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ ఆకొండి పవన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ట్రస్ట్ ప్రతినిధులు చాణక్య, తేజస్విని, లావణ్య, కౌటిల్య, యశస్విని, భరద్వాజ్ సంయోజకులుగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment