ఉచిత ఇసుక వట్టి మాటే
● రీచ్‌లో కూటమి నాయకుల దోపిడీ
● టన్నుకు రూ.300కి పైగా వసూలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు
● మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ధ్వజం
రావులపాలెం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఉచిత ఇసుక వట్టి మాటే తప్ప సామాన్యులకు ఉచితంగా చేరడం లేదని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్తపేట నియోజకవర్గంలో అధికారులు ఆర్భాటంగా టెండర్లు పిలిచిన ర్యాంపుల్లో సైతం కూటమి నాయకులు, టీడీపీ నాయకులు దోపిడీలకు పాల్పడుతున్నారన్నారు. ఆత్రేయపురం మండలంలో ఇసుక రీచ్‌ల్లో టన్నుకు రూ.300 చొప్పున వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వ గెజిట్ పేపర్(ఈనాడు) లోనే వచ్చినా అధికారులు ఎందుకు నమ్మటం లేదని ప్రశ్నించారు. అక్రమాలను అరికట్టాల్సిన జిల్లా సాండ్ కమిటీ ఆయా ర్యాంపుల్లో ఒక అధికారిని నియమించినా, ఈ అక్రమ దందాను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారన్నారు. కూటమి నాయకులు జేబులు నింపుకుంటుంటే అధికారులు చూస్తూ ఉండిపోవడం వెనక మర్మం ఏమిటని ప్రశ్నించారు. ఆత్రేయపురం, ఊబలంక ర్యాంపులతో పాటు ఇతర ర్యాంపుల్లో కూటమి నాయకులు సొంత లారీలు పెట్టుకుని రోజుకు కేవలం 25 లారీలు మాత్రమే బయటకు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయం పక్కనే నాన్ డ్యూటీ పెయిడ్ (ఎన్‌డీపీ) మద్యం దొరికినా అధికారులు కేసులు పెట్టకుండా వదిలిపెట్టడం వెనుక స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఉందన్నారు. మద్యం షాపుల్లో 25 శాతం వాటా ఆయనకు ఉండటం వల్లే ఈ అవినీతి యథేచ్ఛగా జరుగుతోందని ఆరోపించారు. కేసులు కట్టాల్సిన ఎకై ్సజ్ సీఐ సెలవుపై వెళ్లిపోవడం వెనక స్థానిక నాయకుల ఒత్తిడి ఎంతమేరకు ఉందో అర్థమవుతోందన్నారు. గతంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్థానికంగా దొరికిన మద్యంపై వైఎస్సార్ సీపీకి అంట కట్టేందుకు నానా రచ్చ చేశారని, ఇప్పుడు ఎన్‌డీపీ సరకు దొరికినా కేసులు కట్టకపోవడం వెనుక మర్మమేమిటో చెప్పాలన్నారు. ఈ విషయం మీడియాలో రాకుండా తొక్కి పెట్టి ఉంచడం వెనుక కూటమి నాయకులు ఎకై ్సజ్ అధికారులపై ఎంత ఒత్తిడి తెచ్చారో అర్థమవుతుందన్నారు. లబ్ధిదారుడికి ఒక లారీ ఇసుక చేరే సరికి రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు అవుతుందన్నారు. ఉచితం అంటే అర్థం ఇదేనా అని ప్రశ్నించారు. కిలో రూ.120 ఉండే వంటనూనె రూ.170 చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ఎంపీపీ మార్గాన గంగాధరరావు, జెడ్పీటీసీ సభ్యుడు బోనం సాయిబాబు, సర్పంచ్ తమన్న శ్రీను, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, కప్పల శ్రీధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment