బీచ్ వాలీబాల్ పోటీల విజేత తమిళనాడు
సాక్షి, అమలాపురం/ ఉప్పలగుప్తం: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం సముద్ర తీరంలో జరుగుతున్న జాతీయ స్థాయి మహిళా బీచ్ వాలీబాల్ పోటీల ఫైనల్స్‌లో తమిళనాడు జట్టు విజేతగా నిలవగా, చైన్నె వేల్స్ యూనివర్సిటీ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. తమిళనాడు – చైన్నె వేల్స్ యూనివర్సిటీల మధ్య ఆదివారం రాత్రి ఫైనల్స్ జరిగింది. తొలి సెట్‌లో తమిళనాడు జట్టు 22–20 తేడాతో, రెండో సెట్‌లో వేల్స్ యూనివర్సిటీ జట్టు 21–16 తేడాతో ఉండగా, కీలకమైన మూడో సెట్‌లో తమిళనాడు జట్టు వేల్స్ యూనివర్సిటీ జట్టుపై 15–12తో గెలిచి విజేతగా నిలిచింది. మూడో స్థానంలో పుదుచ్చేరి జట్టు నిలిచింది. ఆంధ్రప్రదేశ్ జట్టు నాల్గో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌తో పాటు ఆదివారం రాత్రి మూడు, నాలుగు స్థానాలకు జరిగిన పోరులో తొలి మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు జరిగింది. రెండు జట్లు గెలుపు కోసం శ్రమించాయి. ఈ మ్యాచ్‌ను ఆంధ్రా జట్టు 27–25 తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్ నువ్వా నేను అన్నట్టు జరిగింది. పుదుచ్చేరి జట్టు 22–20 తేడాతో విజయం సాధించింది. కీలకమైన మూడో మ్యాచ్ సైతం ఆసక్తిగా సాగింది. ఈ మ్యాచ్ 15 పాయింట్లకు నిర్వహించగా, పుదుచ్చేరి 17–15 తేడాతో గెలిచింది. ఆంధ్రా జట్టు ఓడినా అద్భుతమైన ప్రతిభతో ప్రేక్షకుల మన్ననలు పొందింది. విజేతలకు ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావులు బహుమతులు అందజేశారు.
ఆటను మించిన భజన
ఎస్.యానాంలో జరిగిన బీచ్ వాలీబాల్ పోటీల్లో క్రీడాకారుల ఆట ప్రదర్శన కన్నా కూటమి నేతల భజనకు అధిక సమయం కేటాయించారు. పోటీలు నిర్వహించిన అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు మించిన వారు లేరని వచ్చిన ప్రతి నాయకుడు మైకులు పగిలేలా మాట్లాడుతూ పోటీలు చూసేందుకు వచ్చిన వారి సహనాన్ని పరీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment