నాణ్యతకు తిలోదకాలు
రోడ్డు నిర్మాణంపై ప్రజల ఆందోళన
ఐ.పోలవరం: బీటీ రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నాణ్యతకు తిలోదకాలు ఇచ్చినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు పంచాయతీ పరిధి నాగమల్లి చెట్టు నుంచి వృద్ధ గౌతమీ ఏటిగట్టుపై సుమారు 1130 మీటర్ల మేరకు బీటీ రోడ్డు పనులకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నుంచి రూ.99 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనిని ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. పనులు చేసేటప్పుడు ఏటిగట్టు బెర్ములకు నాణ్యత లేని మట్టిని వేస్తున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆ పనులను గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు పిన్నమరాజు వెంకట పతిరాజు, ఇందుకూరి రంగరాజు, మోకా రవితో పాటు గ్రామస్తులు పరిశీలించి, పనుల్లో డొల్లతనాన్ని గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఏటిగట్టు రహదారి వేసేటప్పుడు అప్రోచ్ రోడ్డు కోసం పక్కన పటిష్టంగా ఉన్న ఏటిగట్టుకు తూట్లు పొడిచి ఆ మట్టినే అప్రోచ్ రోడ్డుగా వేయడం వల్ల వరదల సమయాల్లో గండ్లు పడే ప్రమాదముందని పేర్కొన్నారు. తాము అభివృద్ధిని అడ్డుకోబోమని పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపిస్తే ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతాన్ని పంచాయతీరాజ్ అధికారులు పరిశీలించారు. నాణ్యత లేనిచోట సరి చేయిస్తామని నాయకులకు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment