మాజీ ఐఆర్‌ఎస్ అధికారి పీఎస్‌ఎన్ మూర్తి
అమలాపురం రూరల్: ఎస్సీ కులాల్లోని ఐక్యతను విడగొట్టేందుకు రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చి కుట్రలు పన్నుతున్నాయని మాజీ ఐఆర్‌ఎస్ అధికారి పీఎస్‌ఎన్ మూర్తి ధ్వజమెత్తారు. ఆయా రాజకీయ పార్టీల నేతలు వారి ప్రయోజనాల కోసం ఎస్సీలపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. అమలాపురం నడిపూడి పంచాయతీ డాబా గార్డెన్‌లో ఆదివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో మూర్తి మాట్లాడారు. రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ కోసం ఎస్సీలను విడగొట్టేందుకు వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారన్నారు. మాలలను టార్గెట్ చేస్తూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాదని, 13 మంది జడ్జీలతో కూడిన బెంచ్ తీర్పునిస్తేనే అది చెల్లుబాటు అవుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణను ఆంధ్రాలో కొన్ని వర్గాలు తప్ప దేశంలో అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల ఎదుగుదలను నిలుపుదల చేయాలన్న ఉద్దేశంతోనే భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ తీర్పును చెప్పించారన్నారు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని ప్రజలకు వివరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని మూర్తి చెప్పారు. ఇందులో భాగంగా ఈ జిల్లా నుంచి అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టామన్నారు. న్యాయవాది ఐఎన్ మల్లేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల నకులరాజు, కార్యదర్శి బంగార్రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment