పల్లెసీమకు పెద్ద పండగ
●
● సంక్రాంతికి ముస్తాబవుతున్న కోనసీమ
● బసవన్నలు.. హరిదాసుల హడావిడి
● రంగలతో ముస్తాబతున్న ఆవాసాలు
● అమ్మలు, అయ్యలు, అన్నదాతలు బిజీ
● స్థానికుల రాకకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, అమలాపురం: పల్లెలకు పెద్ద పండగ.. అన్నదాతల అసలైన పండుగ.. మరీ ముఖ్యంగా గోదారోళ్ల పండుగ సంక్రాంతి.. కొబ్బరి ఆకు చాటు నుంచి ఉషో భానుడి కిరణాలు పుడమిని తాకకుండానే వెలిగే భోగిమంటలు.. సందడి చేసే ఎడ్లబళ్లు.. నోరూరించే నవగాయ పిండివంటలు.. భుక్తాయాసం కలిగించే పంచభక్ష్య పరమాన్నాలు.. నాలుకకు జివ్వుమనిపించే మాంసాహార భోజనాలు.. వీటికి అదనంగా కోడి పందేలు.. ప్రభల తీర్థాలు.. ఇలా గోదావరి జిల్లాల్లో పెద్ద పండగ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పల్లెలు చకచకా ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే ఇంటింటా పలకరిస్తున్న బసవన్నలు.. హరిదాసులు.. కొమ్మదాసరులు.. ఉషోదయ వేళ వారి కీర్తనలు.. పొడగడ్తలు.. బసవన్నల కాలికి కట్టిన మువ్వల శబ్దాలు.. డోలు సన్నాయి వాయిద్యాలు వీనుల విందు చేస్తున్నాయి.
అమలాపురం శివారు గాంధీనగర్‌ను ఆనుకుని ఉన్న గంగిరెద్దుల వారికి డిమాండ్ వచ్చింది. ఇప్పటికే ఊరూరా తిరుగుతూ ఈనెల 8 నుంచి కార్పొరేట్ కాలేజీలు, పాఠశాలల వద్ద ముందస్తు సంక్రాంతి పండుగకు అడ్వాన్స్ బుకింగులు అయిపోయారు. వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న గంగిరెద్దులవారితో పాటు కొమ్మదాసరి వారు, హరిదాసులు హుషారుగా ఊరూరా తిరుగుతున్నారు. కాలి నడకన తిరగలేని హరిదాసులు మోటారు సైకిల్ మీద వీధులలో హరిలో రంగ హరి అంటూ స్టీరియోల్లో మోతెక్కిస్తున్నారు. మంచు పరదాలు కప్పుకున్న పల్లెల్లోని వీధులు పేడ కళ్లాపులు.. రంగవల్లులతో కొత్త అందాలు సంతరించుకుంటున్నాయి. మరోవైపు పూరిళ్లలో పేడ అలుకుళ్లు మొదలయ్యాయి. సంక్రాంతికి రెండు రోజుల ముందు వీటి మీద ఇల కోల్పు (సున్నం ముగ్గులు) వేసి మరింత అందంగా అలంకరించుకుంటున్నారు. మరికొంత మంది ఇళ్లకు రంగులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. అన్నదాతలు సైతం కాడెడ్లకు.. ఎడ్ల బళ్లకు ఎంతో ముచ్చటైన అలంకారాలు చేస్తున్నారు. పశువుల మెడలకు మువ్వల దండలు.. బళ్లకు రంగురంగుల పువ్వులు, గంటలతో కూడిన తాళ్లు అలంకరిస్తున్నారు. మరోవైపు ఇళ్ల ముందు అలంకరణకు.. పక్షుల ఆశీస్సులు కోరుతూ కట్టే ధాన్యపు కుచ్చులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. రూ.5 వందల నుంచి రూ.వెయ్యి వరకు వీటి పరిమాణాన్ని బట్టి అల్లిక బట్టి విక్రయిస్తున్నారు. ఇంత చెప్పి కోనసీమ అనగానే కొబ్బరి చెట్లను మర్చిపోతే ఎలా.. వాటికీ అలంకారాలు చేసేశారు పల్లె వాసులు. వచ్చే భోగి పండగ కోసం అందినంత మేర పిడకలకు ఆవాసమయ్యాయి ఆ చెట్ల మానులు. వీటితోపాటు పాత ఇంటి గోడలు సైతం గోవు పిడకలతో నిండిపోయాయి. అమలాపురం వేదమాత గాయత్రి ఆలయం ఆధ్వర్యంలో గోవు పిడకలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. పిండి వంటల సన్నాహాలు ఆరంభమయ్యాయి. ఈ ఏడాది నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ఏటా ఒకసారి వచ్చే పండుగను అప్పోసొప్పో చేసైనా ఘనంగా నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.
కొత్త స్టాక్‌తో వస్త్ర దుకాణాలు కిటకిట
అమలాపురంతో పాటు రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలు పలు వాణిజ్య గ్రామాల్లో సైతం వస్త్రాల షాపులు కొత్త స్టాక్‌తో కళకళలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రముఖ వస్త్ర వ్యాపార కేంద్రం ద్వారపూడిలో సైతం భారీగా కొత్త స్టాక్ తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. రోడ్ల వెంబడి విక్రయించేవారు సైతం సన్నాహాలు చేసుకుంటున్నారు.
రైళ్లు.. బస్సులు ఫుల్
ఉపాధి, ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు పండగకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, రావులపాలెం డిపోల నుంచి సుమారు వందకు తక్కువ కాకుండా ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి జిల్లాకు.. సంక్రాంతి తరువాత ఇక్కడి డిపోల నుంచి హైదరాబాద్‌కు సర్వీసులు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
సంక్రాంతి సందడి (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment