జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు
● జొన్నాడలో మైన్స్ విజిలెన్స్ తనిఖీలు
● ఇసుక గుట్టల సీజ్
ఆలమూరు: జొన్నాడలో ఇసుక అక్రమ తవ్వకాల జోరుకు మైన్స్ అండ్ విజిలెన్స్ శాఖ అడ్డుకట్ట వేసింది. నిబంధనలకు విరుద్ధంగా స్థానిక ఇసుక ర్యాంపులో ప్రభుత్వ పనుల పేరిట తవ్వకాలు సాగుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశాల మేరకు మైన్స్ పీడీ ఎల్.వంశీధర్‌రెడ్డి నేతృత్వంలో అధికారులు సి.సుజాత, ఎండీ రెహమాన్ ఆలీ తదితరులు శనివారం స్థానిక ఇసుక ర్యాంపులో తనిఖీలు చేపట్టారు. వారి రాకను గుర్తించిన కూటమి నేతలు ర్యాంపును మూసివేశారు. దీంతో మైన్స్ అధికారులు ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించి పరిమితికి మించి లోతుగా తవ్విన విధానాన్ని, అనధికార నిల్వలను గుర్తించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా జొన్నాడ ఏటిగట్టు దిగువన కాటా వద్ద అనధికారిక ఇసుక గుట్టలను అధికారులు సీజ్ చేసి తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ ఇసుక గుట్టలను యథాస్థానంలో ఉంచాలని మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎం.రావాయమ్మ, వీఆర్‌ఓలను ఆదేశించారు. మైన్స్ ఆర్‌ఐ సుజాతను వివరణ కోరగా ఇసుక అక్రమ తవ్వకాలు జరగడం వాస్తవమేనన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment