అక్రమాలకు రీచ్ అయ్యారు!
ఫ కూటమి నేతల చేతివాటం
ఫ ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ.200 వసూలు
మామిడికుదురు: ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు.. అక్రమాలకు తెరలేపుతున్నారు.. అనధికారంగా నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపుల్లో కూటమి నేతలు అక్రమ వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఈ వసూళ్లు ఆ పార్టీ నేతలకే రుచించడం లేదు. దీనిపై ప్రజలతో పాటు ఆ నేతలు బహిరంగంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక అని ప్రచారం చేస్తున్నా అది ఎక్కడా అమలు కావడం లేదని అంటున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి తెలిసే ఈ వ్యవహారం జరుగుతుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయినప్పటికీ అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మామిడికుదురు మండల పరిధిలో పెదపట్నం, అప్పనపల్లి, పెదపట్నంలంక, పాశర్లపూడి గ్రామాల్లోని రీచ్‌ల నుంచి ఇసుక తీస్తున్నారు. పెదపట్నం, అప్పనపల్లి రీచ్‌ల్లో శనివారం నుంచి, పెదపట్నంలంక, పాశర్లపూడి రీచ్‌ల్లో ఆదివారం నుంచి ఇసుక తీస్తున్నారు. గతంలో ఇసుక తీసినా పలు ఆరోపణలతో కొంత బ్రేక్ ఇచ్చారు. మళ్లీ నాలుగు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి.
ఆ సొమ్ము ఎవరి కోసం..
ఈ నాలుగు రీచ్‌ల్లో ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ.200 అదనంగా వసూలు చేస్తున్నారు. ఆ రెండొందలు ఎవరి కోసమంటూ జనసేనకు చెందిన కొందరు యువకులు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. కూటమికి చెందిన మండల స్థాయి ప్రధాన నేతల కనుసన్నల్లో ఈ అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. నాలుగు రీచ్‌ల నుంచి ప్రతి రోజు 150 నుంచి 160 ట్రాక్టర్ల ఇసుక తీస్తున్నారని చెబుతున్నారు. ఈ విధంగా రోజుకు రూ.వేలల్లో అక్రమ వసూళ్లు చేస్తున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం ట్రాక్టరు ఇసుకకు రూ.1,800 వసూలు చేస్తున్నారు. ఇందులో ఇసుక తీసి, ట్రాక్టర్లలో ఎగుమతి చేసినందుకు జట్టుకు రూ.వెయ్యి ఇస్తున్నారు. ట్రాక్టరు కిరాయి రూ.500. మిగిలిన మూడొందల్లో రూ.200 పక్కన పెడుతున్నారని చెబుతున్నారు. మరో రూ.100 గ్రామ పంచాయతీ అభివృద్ధికి, ట్రాక్టర్ వెళ్లే బాటకు అని చెబుతున్నారు. అయితే ఆ రూ.200 ఎవరికి అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. ఎవరైనా ప్రశ్నిస్తుంటే మీకు తెలియంది ఏముందంటూ సమాధానం వస్తుందని ప్రజలు పేర్కొంటున్నారు. దీనిపై కూటమి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. అక్రమ వసూళ్లపై సమాధానం చెప్పుకోలేక పోతున్నామంటూ కూటమి శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ అక్రమ వసూళ్ల పర్వానికి చరమగీతం పాడాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు స్పందించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment