సారొస్తారొస్తారా?
రామచంద్రపురం ఉప విద్యాశాఖ కార్యాలయం
● డీవైఈఓ పోస్టుల భర్తీకి గ్రహణం ● ఉప విద్యాశాఖ కార్యాలయాల్లో పర్యవేక్షణ గాలికి
రాయవరం: ప్రక్షాళనలు చేయడం కాదు.. దానికి అనుగుణంగా ఏర్పాట్లు జరగాలి.. లేకుంటే మొదటికే మోసం వస్తోంది.. అచ్చం అలానే ఉప విద్యా శాఖ కార్యాలయాల్లో పరిస్థితి తయారైంది. అదేంటో తెలుసుకుందాం రండి. ఇప్పటి వరకూ కోనసీమ జిల్లా విద్యా శాఖ పరిధిలో రెండు ఉప విద్యా శాఖ కార్యాలయాలు ఉండగా, కొత్తగా మరో కార్యాలయం ఏర్పడింది. ఇందుకు అనుగుణంగా జిల్లాలో ఉప విద్యా శాఖ కార్యాలయాల పరిధిని నిర్ధారిస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే మూడు ఉప విద్యాశాఖ కార్యాలయాల్లో రెండు చోట్ల ఉప విద్యాశాఖ అధికారులు లేక పర్యవేక్షణ గాలిలో కలుస్తోంది. జిల్లాలో 22 మండలాలు ఉండగా, ఇప్పటి వరకూ అమలాపురం, రామచంద్రపురం ఉప విద్యాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. అమలాపురం డీవైఈఓ కార్యాలయ పరిధిలో 13 మండలాలు ఉండగా, రామచంద్రపురం డివిజన్ పరిధిలో తొమ్మిది మండలాలు ఉన్నాయి. ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉప విద్యాశాఖ ఏర్పాటు చేసే క్రమంలో కొత్తగా కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో మరో ఉప విద్యాశాఖ కార్యాలయం ఏర్పాటైంది. ఆ మూడు కార్యాలయాల పరిధిలో మండలాలను కేటాయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పది మండలాలతో అమలాపురం, ఏడు మండలాలతో కొత్తగా కొత్తపేట, ఐదు మండలాలతో రామచంద్రపురం ఉప విద్యాశాఖ కార్యాలయాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఉపాధ్యాయుల సర్దుబాటు కూడా మూడు ఉప విద్యాశాఖ కార్యాలయాల పరిధిలో చేస్తున్నారు. అయితే మూడు డివిజన్లలో కొత్తపేట డివిజన్‌కు పూర్తి స్థాయిలో డీవైఈఓ, సిబ్బందిని నియామకం చేపట్టాల్సి ఉంది. అలాగే డీవైఈఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం జిల్లాలో మూడు విద్యాశాఖ డివిజన్లు ఏర్పడడంతో పూర్తి స్థాయి సిబ్బంది ఏర్పడితే పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉండడం, విద్యా ప్రగతిపై మానిటరింగ్‌కు అవకాశముంటుందని అందరూ భావించారు. అయితే కొత్తపేట ఉప విద్యాశాఖ కార్యాలయం ఏర్పడినప్పటికీ ఉప విద్యాశాఖ అధికారిని నియమించ లేదు. ఇదిలా ఉంటే రామచంద్రపురం డీవైఈఓగా విధులు నిర్వహించిన ఎస్.నరసింహ ఫణి గతేడాది డిసెంబరు 6న బదిలీపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లడంతో అప్పటి నుంచి రామచంద్రపురం డీవైఈఓగా ఎవరినీ నియమించలేదు. అంతకు ముందు వరకూ రామచంద్రపురం డీవైఈఓగా ఉన్న నరసింహ ఫణి కొత్తపేట డీవైఈఓ కార్యాలయానికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. నరసింహఫణి కూడా బదిలీ అయ్యారు. ఇక్కడ అధికారులు లేక రెండు డివిజన్ల పరిధిలో ప్రతి నెలా ప్రధానోపాధ్యాయుల ఇంక్రిమెంట్లు, సాధారణ, వైద్యపరమైన సెలవులను ఆమోదించడం, పాఠశాలలపై పర్యవేక్షణ చేయడం వంటి పనులు కుంటుపడ్డాయి. మరో రెండు నెలల్లో పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి కీలకమైన బాధ్యతలు డీవైఈఓనే నిర్వర్తించాల్సి ఉంటుంది. రెండు నెలల తర్వాత ఎట్టకేలకు శనివారం రామచంద్రపురం, కొత్తపేటలకు డీవైఈఓగా రాయవరం ఎంఈఓ–1 పి.రామలక్ష్మణమూర్తిని నియమిస్తూ పాఠశాల విద్యా శాఖ ఆర్జేడీ ఉత్తర్వులు ఇవ్వడం కొసమెరుపు.
ఉప విద్యాశాఖ కార్యాలయం.. పరిధిలోని మండలాలు
అమలాపురం అల్లవరం, అమలాపురం, ఐ.పోలవరం, కాట్రేనికోన, మలికిపురం,
మామిడికుదురు, ముమ్మిడివరం, రాజోలు, సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం
కొత్తపేట అయినవిల్లి, ఆలమూరు, అంబాజీపేట, ఆత్రేయపురం, కొత్తపేట,
పి.గన్నవరం, రావులపాలెం
రామచంద్రపురం కె.గంగవరం, కపిలేశ్వరపురం, మండపేట, రామచంద్రపురం, రాయవరం
Comments
Please login to add a commentAdd a comment