అంతర్వేది ఉత్సవాలు అద్భుతంగా చేద్దాం
● కలెక్టర్ మహేష్ కుమార్
● ఎక్కడా ఇబ్బందీ రాకుండా చర్యలు
అమలాపురం రూరల్: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణోత్సవాలను అద్భుతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వ సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. శనివారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో కల్యాణ మహోత్సవాల ఏర్పాట్లపై ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 4 నుంచి 13వ తేదీ వరకూ ఉత్సవాలు జరపాలని నిర్ణయించామన్నారు. 4న రథసప్తమి నుంచి కల్యాణోత్సవాలు ప్రారంభమై పది రోజుల పాటు గ్రామోత్సవం, స్వామివారి దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. 5న గరుడ పుష్పక వాహనంపై, 6న హంస వాహనంపై గ్రామోత్సవాలు ఉంటాయన్నారు. 7న ఉదయం గజమాల అలంకరణ, రాత్రి 10.30 గంటల నుంచి తెల్లవారు జామున మూడు గంటల వరకూ స్వామివారి తిరు కల్యాణోత్సవం ఆరు బయట ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 12 ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దేవస్థానంలో వీఐపీ, శీఘ్ర, సాధారణ దర్శనాల కోసం మూడు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. 8న అక్షితల సేకరణ, పంపిణీ కార్యక్రమాలు, స్వామివారి రథోత్సవం జరుగుతుందన్నారు. 9, 10, 11న గ్రామోత్సవాలు, 12న స్వామివారి చక్రస్నానం నిర్వహిస్తారని తెలిపారు. స్వామివారికి తెప్పోత్సవం 13న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ నిర్వహిస్తారన్నారు. భక్తుల సౌకర్యార్థం బస్సులను దేవాలయం వరకూ నడిపేందుకు సాధ్యాసాధ్యాలపై ఆర్‌అండ్‌బీ, ఆర్టీసీ అధికారులతో చర్చించారు. స్నాన ఘట్టాల వద్ద భక్తుల భద్రత కోసం మత్స్యశాఖ 4 రెస్క్యూ బోట్లు, 100 మంది ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ కల్యాణోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అధికారులంతా సమన్వయంతో సాగి విజయవంతం చేయాలన్నారు. ఉత్సవాల నిర్వహణలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు భాగస్వాములు అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.మాధవి, అడ్మిన్ ఎస్పీ ప్రసాద్, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment