జ్వరీక్షలు మొదలు!
● జిల్లా అంతటా పరీక్షల ఫీవర్ ప్రారంభం
● ఫిబ్రవరి 10 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
● మార్చి 1 నుంచి ఇంటర్,
17 నుంచి టెన్త్ ఎగ్జామ్స్
రాయవరం: జిల్లా అంతటా పరీక్షల ఫీవర్ ప్రారంభమైంది. విద్యార్థి దశకు కీలకమైన 10వ తరగతి, ఉన్నత విద్యకు మార్గంగా ఉపయోగపడే ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు సీరియస్‌గా సిద్ధపడుతున్నారు. ఇంటర్ విద్యకు సంబంధించి 2024–25 విద్యా సంవత్సరం వార్షిక పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలకు ముందుగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్, 3న పర్యావరణ విద్య పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్షల ఫీవర్ ప్రారంభం కావడంతో విద్యార్థులకే కాదు తల్లితండ్రులు, ఉపాధ్యాయులపై ఆ ప్రభావం కన్పిస్తోంది.
27,905 మంది ఇంటర్ విద్యార్థులు
జిల్లాలో 13 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్, ఆరు ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలు, 64 ప్రైవేట్ అన్ ఎయిడెడ్, 44 ఒకేషనల్ జూనియర్ కళాశాలలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ 13,965, సెకండియర్ 13,940 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఫిబ్రవరి 10న జరిగే ప్రాక్టికల్ పరీక్షలకు 6,594 మంది ఎంపీసీ, 1,728 మంది బైపీసీ విద్యార్థులు హాజరు కానున్నారు. ఒకేషనల్ కోర్సుల్లో విద్యాభ్యాసం చేసే ఫస్టియర్ విద్యార్థులు 2,367, సెకండియర్ విద్యార్థులు 2,346 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నారు.
ఫిబ్రవరి మొదటి వారంలో రెండు పరీక్షలు
ఇంటర్మీడియెట్ ఫస్టియర్ విద్యార్థులకు ఫిబ్రవరి మొదటి మాసంలో రెండు పరీక్షలు నిర్వహిస్తారు. 1వ తేదీన ‘నీతి నిజాయితీ, మానవీయ విలువలు’ పరీక్షను, 3న, ‘పర్యావరణ విద్య’ పరీక్షను నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇంటర్మీడియెట్ విద్యార్థులకు నైతిక విలువలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ పరీక్షలను ఇంటర్ విద్యామండలి ఏటా నిర్వహిస్తోంది. ఈ రెండు పరీక్షల్లోను ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఈ రెండు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకుండా సెకండియర్‌లో ప్రాక్టికల్స్, థియరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా వారు ఫెయిలైనట్లుగా ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే ఈ నెల 20 నుంచి 25 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
‘పది’ పరీక్షలకు 19,200 మంది
జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపాల్టీ, సంక్షేమ, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 19,200 మంది పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. వీరంతా మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులుగా హాజరు కానున్నారు.
రెండేళ్లుగా ‘పది’ ఫలితాల్లో జిల్లా స్థానమిలా..
విద్యా సంవత్సరం రాష్ట్రంలో స్థానం
2022–23 13
2023–24 04
ఇంటర్ ఫలితాల్లో స్థానం..
2022–23 08 (ఉమ్మడి జిల్లా)
2023–24 16
మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
కళాశాలల్లో పరీక్షలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాం. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాం. – వనుము సోమశేఖరరావు,
ఇంటర్ జిల్లా విద్యాశాఖాధికారి, అమలాపురం
ఉత్తమ ఫలితాలు సాధించేలా
పది పబ్లిక్ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొని ఉత్తమ ఫలితా లు సాధించేందుకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను పది విద్యార్థులకు అమలు చేస్తున్నాం. ప్రతి రోజు అసైన్‌మెంట్స్, వీక్లీటెస్ట్‌లు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ షేక్ సలీం బాషా,
జిల్లా విద్యాశాఖ అధికారి, అమలాపురం.
Comments
Please login to add a commentAdd a comment