నేటి నుంచి పశు వైద్య శిబిరాలు
అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి 31వ తేదీ వరకు జరిగే పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ రైతులకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో పశు వైద్య శిబిరాల వాల్‌పోస్ట్‌ర్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం కింద నిర్వహించే ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ పశు వైద్యులు, పారా పశు వైద్యులు, సిబ్బందితో కూడిన బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. వైద్య బృందాలు గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తూ గొర్రెలు, మేకలు, లేగ దూడలకు నట్టల నివారణ మందు ఉచితంగా అందిస్తారన్నారు. పశువులకు వైద్య పరీక్షలు చేయడంతో పాటు, గర్భకోశ వ్యాధులకు సంబంధించి అవసరమైతే శస్త్ర చికిత్సలకు చర్యలు తీసుకుంటారని వివరించారు. పశు వైద్య శాఖ ఉద్యోగి వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
విఘ్నేశ్వరుని సన్నిధిలో
పోటెత్తిన భక్తులు
అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలు కొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస రుద్రాభిషేకాలు, వివిధ ప్రత్యేక పూజలు జరిపారు. స్వామిని మహానివేదన అనంతరం వివిధ పుష్పాలతో అర్చకస్వాములు సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాల్లో 24 మంది, లక్ష్మీగణపతి హోమంలో 15 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. 17 మంది చిన్నారులకు నామకరణ, అక్షరాభ్యాసం, తులాభారం వంటివి జరిపారు. 40 మంది తమ నూతన వాహనాలకు పూజలు చేయించుకున్నారు. స్వామివారి అన్నదాన పథకంలో 3,080 మంది అన్న ప్రసాదం స్వీకరించారు. స్వామివారికి వివిధ పూజలు, అన్నదాన విరాళాలుగా రూ.2,09,444 ఆదాయం లభించిందని ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
యథావిధిగా గ్రీవెన్స్
అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని సూచించారు. జిల్లాస్థాయితోపాటు డివిజన్, మండల స్థాయిలో గ్రీవెన్స్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
లోవకు పోటెత్తిన భక్తులు
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 8 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఇన్‌చార్జ్ డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,72,410, పూజా టికెట్లకు రూ.1,73,630, కేశఖండన శాలకు రూ.10,640, వాహన పూజలకు రూ.4,150, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.90,632, విరాళాలు రూ.1,35,553 కలిపి మొత్తం రూ.5,87,015 ఆదాయం సమకూరిందని వివరించారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను ఈఓతో కలసి తాండవ షుగర్స్ మాజీ చైర్మన్ సుర్ల లోవరాజు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment