పాండిచ్చేరీ సైన్స్ ఫెయిర్‌కు ఊబలంక ప్రాజెక్టు
రావులపాలెం: పాండిచ్చేరీలో ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగనున్న జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు రావులపాలెం మండలం ఊబలంక జెడ్పీ ఉన్నత పాఠశాల బృందం ఆదివారం తరలివెళ్లింది. గైడ్ టీచర్ ఇ.నాగలక్ష్మి పర్యవేక్షణలో పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి ఎన్.నిఖిల్ విజయ్‌కుమార్‌రెడ్డి రూపొందించిన ‘ఆటోమెటిక్ రెయిన్ డిటెక్టర్ అండ్ క్లాత్ కలెక్టింగ్ మెషీన్’ ప్రాజెక్టు ఇటీవల రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది.
సాధారణంగా ఇంటి వద్ద ఆరబెట్టిన దుస్తులు వర్షం వస్తే తడిసిపోతాయి. వర్షం వస్తున్న విషయాన్ని ముందే గ్రహించి దుస్తులను తడవని చోటుకి తరలించడం, వర్షం తగ్గిన తర్వాత మళ్లీ వాటిని యథాస్థానంలోకి వెళ్లే విధంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినట్టు విద్యార్థి నిఖిల్ విజయ్‌కుమార్‌రెడ్డి, గైడ్ టీచర్ నాగలక్ష్మి తెలిపారు. పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్‌లోని చిన్న పరికరాలు, సర్వో మోటార్, ట్రెడ్ బోర్డు, రైన్ సెన్సార్, జంపర్ వైర్లు ఉపయోగించి ఈ ప్రాజెక్టును రూపొందించినట్టు వివరించారు. జాతీయ స్థాయిలో ఐదు రోజుల పాటు జరిగే పోటీల్లో ఈ ప్రాజెక్టును ప్రదర్శించనున్నారు. పాండిచ్చేరీ బయలుదేరిన నిఖిల్, నాగలక్ష్మి బృందానికి జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బాషా, ఎంపీడీఓ మహేశ్వరరావు, ఎంఈఓ నాగకుమార్, పాఠశాల హెచ్‌ఎం సీహెచ్‌ఎన్‌ఎస్.శ్రీనివాస్, ఎస్‌ఎంసీ చైర్మన్ ఎం.సురేశ్వరరెడ్డి అభినందనలు తెలిపారు.
ముంగండలో 22 నుంచి
రుగ్వేద సభలు
పి.గన్నవరం: ముంగండ గ్రామంలోని చింతామణి గణపతి మందిరంలో ఈ నెల 22 నుంచి 26 వరకూ రుగ్వేద సంహిత పారాయణ, వేద విద్వత్ సభలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆశ్వలాయన మహిర్షి రుగ్వేద పరిషత్ సభ్యులు తెలిపారు. ఈ సభల్లో వేద రక్షకులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment