మోసం చేయడం బాబుకు కొత్తేమీ కాదు
వైఎస్సార్ సీపీజిల్లా అధ్యక్షుడు విశ్వరూప్
అమలాపురం రూరల్: ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పిన సీఎం చంద్రబాబు నీతి అయోగ్ సమావేశంలో రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవని, సంక్షేమాన్ని అందించలేమనడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పినిపే విశ్వరూప్ అన్నారు. శుక్రవారం అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలోని క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్తేమీ కాదని అన్నారు. సంపద సృష్టి అని చెప్పుకొనే చంద్రబాబు తాను సంపాదించుకోవడానికి సమయం కేటాయిస్తున్నారని విశ్వరూప్ ఎద్దేవా చేశారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ వెళ్లి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చే కంపెనీలు తెస్తే, ఇక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం దారి ఖర్చులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి తెచ్చారన్నారు. ఫిబ్రవరి 5న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే వైఎస్సార్ సీసీ ఫీజు పోరు ధర్నాను విజయవంతం చేయాలని విశ్వరూప్ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలసి ఆయన ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, పార్టీ పట్టణ, మండలాల అధ్యక్షులు సంసాని బుల్లి నాని, బద్రి బాబ్జి, జెడ్పీటీసీ సభ్యులు పందిరి శ్రీహరిరామ్‌గోపాల్, గెడ్డం సంపదరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి నాగేంద్రమణి, వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు, ఐటీ విభాగం అధ్యక్షుడు తోరం గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment