సూపర్ సిక్స్ పథకాలెక్కడ!
● నమ్మించి మోసం చేసిన ‘కూటమి’
● మాజీ ఎంపీ చింతా అనురాధ
అల్లవరం: తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాల ద్వారా తల్లులకు రూ. 15 వేలు, రైతుకు రూ.20 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ. 1,500, ఉచిత బస్సు, యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను నట్టేట ముంచారని మాజీ ఎంపీ చింతా అనురాధ ఓ ప్రకటనలో అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడు నెలలు పూర్తయినా నేటికీ సూపర్ సిక్స్ అమలులో విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఈ పథకాలపై ఊదరగొట్టిన కూటమి నేతలు ఆ ఊసుఎత్తడం లేదని విమర్శించారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని మైక్ పట్టుకుని ఊగిపోతూ ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పథకాల అమలుపై సీఎం చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, తల్లులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా అన్నివర్గాల వారిని మోసం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టించిందని ఎద్దేవా చేశారు. రూ. 100 కోట్లు ఖర్చు చేసి దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు ఈ రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు గుండు సున్నా అని అన్నారు. కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై రూ. 16 వేల కోట్ల భారం మోపారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో సంక్షేమ క్యాలెండర్‌ను తూచా తప్పకుండా అమలు చేశారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment