![రేపు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/07022025-kona_tab-07_subgroupimage_287208912_mr-1738866809-0.jpg.webp?itok=ZML5h31d)
రేపు నవోదయ ఎంపిక పరీక్ష
పెద్దాపురం: పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయలో 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శనివారం ఉదయం 11 గంటలకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవోదయ విద్యాలయలో పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, సెంటర్ లెవెల్ పరిశీలకులతో నవోదయ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కె.రామకృష్ణయ్య గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల నిర్వహణకు పెద్దాపురంలో 9 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తొమ్మిదో తరగతికి 1,451 మంది, 11వ తరగతిలోకి ప్రవేశానికి 699 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
గుండెపోటు బాధితులకు
ఉచితంగా ఇంజక్షన్
కాకినాడ సిటీ: గుండెపోటు బాధితులకు జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందుబాటులో ఉందని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. గుండెపోటు లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ ఎన్.స్వప్నతో కలిసి కలెక్టరేట్‌లో గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తుని ఏరియా ఆసుపత్రితో పాటు జిల్లాలోని 9 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గుండెపోటు బాధితులకు అందించే ఇంజక్షన్ అందుబాటులో ఉందన్నారు. రూ.40 వేల విలువైన ఈ ఇంజక్షన్‌ను ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ గుండె పోటుకు గురైన 82 మందికి ఈ ఇంజక్షన్ అందించామన్నారు. గుండె నొప్పికి గురయ్యే వారు తొలి గంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన వైద్య సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ కోరారు.
బీసీ హాస్టళ్లలో సంక్షేమం
అగమ్యగోచరం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బీసీ హాస్టళ్లలో సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అగమ్యగోచరంగా మారుస్తోందని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. కుటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా పెండింగ్ బిల్లు లు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. అద్దె భవనాల్లోని హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మిస్తామన్నారని, మెస్, కాస్మెటిక్ చార్జీలు పెంచుతామన్నారని, ఇవేవీ నెరవేరలేదని అన్నారు. బాలికల హాస్టళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చే యాలని ఉన్నత న్యాయస్థానం చెప్పినా అమలు చేయలేదన్నారు. పోస్టులు భర్తీ చేయకపోవడంతో హాస్టళ్లను ఇన్‌చార్జి వార్డెన్లు నడుపుతున్నారని, మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని పేర్కొన్నారు. హాస్టళ్లలోని పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు.
![రేపు నవోదయ ఎంపిక పరీక్ష 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06kkd106-270022_mr-1738866809-1.jpg)
రేపు నవోదయ ఎంపిక పరీక్ష
Comments
Please login to add a commentAdd a comment