![అంతర పంటలతో ఆర్థికవృద్ధి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06rzl121-270019_mr-1738866809-0.jpg.webp?itok=J-E9zdOC)
అంతర పంటలతో ఆర్థికవృద్ధి
అంబాజీపేట/పి.గన్నవరం: కొబ్బరి తోటల్లో అంతర పంటల సాగు ద్వారా రైతులు ఆర్థిక పురోభివృద్ధి చెందుతారని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ రైతులకు పిలుపునిచ్చారు. అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో సర్పంచ్ దొంగ నాగేశ్వరరావుకు చెందిన, పి.గన్నవరం మండలం ముంగండ గ్రామంలోని ఖండవిల్లి వెంకటరమణ, నాగేశ్వరరావుకు చెందిన కొబ్బరితోటలలో అంతర పంటలను గురువారం ఆయన పరిశీలించారు. కొబ్బరిలో సాగవుతున్న కోకో, అరటి, పసుపు తదితర పంటలు, కోకో సోలార్ డ్రైయింగ్ యూనిట్ పరిశ్రమను పరిశీలించి ప్రాసెసింగ్ విధానాలను అడిగితెలుసుకున్నారు. ఇటీవల కాలంలో కొబ్బరి రైతులకు అంతర పంటల సేద్యం కల్పతరువుగా మారిందని, కోస్తా జిల్లాల్లో వాతావరణం కొబ్బరి సాగుకు అనుకూలమని, అందువల్లనే కొబ్బరి తోటల విస్తీర్ణం కోనసీమలో ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. కొబ్బరి తోటల్లో ఉండే పాక్షిక నీడ వల్ల చల్లని వాతావరణం ఏర్పడుతుందని, ఈ వాతావరణం కోకో సుగంధ ద్రవ్య పంటలకు ఎంతో అనువైనదని, ఏళ్ల తరబడి ఉన్న కొబ్బరి తోటల్లో అనేక సుగంధ ద్రవ్య పంటలను అంతర పంటలుగా సాగు చేస్తూ, నేరుగా మార్కెటింగ్ చేసుకుంటూ లాభాలను ఆర్జించాలన్నారు. ప్రకృతి సేద్యంతో పాటు శాసీ్త్రయ విధానాలను ఆధునిక సేద్యంతో మేళవించి అధికాదాయం పొందాలని సూచించారు. అలాగే డ్రైయర్ యూనిట్ స్థాపనకు పెట్టుబడి వ్యయంపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి బీవీ రమణ, తహసీల్దార్లు జె.వెంకటేశ్వరి, పి.శ్రీపల్లవి, ఉద్యాన అధికారి శైలజ, ఏపీఈఆర్సీ సభ్యుడు ముత్యాల జమీల్ తదితరులతో పాటు ఉద్యాన, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ మహేష్‌కుమార్
పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన
Comments
Please login to add a commentAdd a comment