చూచిన కన్నుల భాగ్యమిదే..
సాక్షి, అమలాపురం/సఖినేటిపల్లి/మలికిపురం: భువిపై ఆది దేవుడై వెలసిన అంతర్వేది పుణ్యక్షేత్రం కోలాహలంగా మారింది. వేదికపై శ్రీ, భూ సమేత లక్ష్మీ నృసింహుని పరిణయాన్ని చూసేందుకు వచ్చిన భక్తజనంతో కిటకిటలాడింది. చూసే కన్నులదే భాగ్యం అన్నట్టుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వేదికపై ఉంచి సుమారు నాలుగు గంటల పాటు నిర్విరామంగా సాగిన వేడుకను వేలాది భక్తులు ప్రత్యక్షంగా, కోట్లాది మంది పరోక్షంగా వీక్షించి పులకించిపోయారు. స్వామివారి కళ్యాణంతో పరమ పవిత్ర వశిష్ఠ గోదావరి తీరం ఆధ్యాత్మిక వాహిని వరవళ్లు తొక్కింది. తీరంలోని సముద్ర ఘోషను భక్తజన గోవింద ఘోష మించిపోయింది. నామస్మరణలు.. వేద పండితుల పన్నాలు.. రంగురంగుల పూవులతో శోభాయమానంగా అలంకరించిన కల్యాణ వేదిక.. పట్టు వస్త్రాలు, బంగారం, వజ్రాభరణాలతో స్వామి, అమ్మవార్లు మెరిసిపోయారు. కల్యాణ మండపం చుట్టూ భారీ పందిళ్లు.. విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా మారిన అంతర్వేదిలో లక్ష్మీనృసింహుని కల్యాణం నయనానందకరంగా సాగింది.
అంగరంగ వైభవంగా
రాత్రి 10 గంటలకు ఎదురు సన్నాహంతో కల్యాణ తంతు ప్రారంభమైంది. ఆచారం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన దేవస్థానం చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహద్దూర్ శ్రీవారి తరఫున, అర్చక స్వాములు అమ్మవారి తరఫున కల్యాణ కర్తలుగా నిలిచారు. స్వామివారి కల్యాణం శుక్రవారం అర్ధ రాత్రి 12–55 (తెల్లవారితే శనివారం) గంటలకు మృగశిర నక్షత్ర యుక్త వృశ్చిక లగ్నం పుష్కరాంశలో జరిగింది. వైష్ణవ సంప్రదాయ వైఖానస ఆగమానుసారం ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకట శాస్త్రి పర్యవేక్షణలో అర్చక బృందం కల్యాణాన్ని నిర్వహించింది. సుముహూర్తానికి జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని స్వామివారి శిరస్సుపై ప్రధాన అర్చకుడు కిరణ్, అమ్మవార్లు శ్రీదేవి, భూదేవి శిరస్సులపై సహాయ అర్చకులు ఉంచారు. ఎప్పటిలాగానే శఠారి, వైరుముడి, సూర్య పతకం, చిన్ని కిరీటం, వెండి కిరీటం, సాదా కిరీటం, కంటె, పచ్చలు, కెంపులు, వజ్రాలతో పొదిగిన కిరీటం, హంస పతకం, నవ రత్నాలు పొదిగిన హారం, పగడాల మాల, తొమ్మిది ఈస్ట్ ఇండియా మోహాళీలు, 12 రకాల నానుతాడులు, చిన్ని లక్ష్మీ కాసుల పేర్లతో వారిని అలంకరించారు. వీటితో పాటు అంతర్వేదికరకు చెందిన దివంగత డాక్టర్ పోతురాజు సూర్య వెంకట సత్యనారాయణ సమర్పించిన అభరణాలను సైతం అలంకరించారు.
ఆనవాయితీగా అన్నవరం, టీటీడీ దేవస్థానాల తరఫున అధికారులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా తీరప్రాంత వాసులు, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన వేలాది భక్తులు కల్యాణాన్ని తుది వరకు చూసి ఆనందపడిపోయారు. వేలాది మంది భక్తులకు దేవస్థానం నోటిఫైడ్, ప్రైవేట్ సత్రాలు ఆకలి దప్పికలు తీర్చాయి. కల్యాణాన్ని స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జేసీ నిశాంతి, ఎస్పీ కృష్ణారావు, దేవదాయశాఖ డీసీ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. కల్యాణానికి అంచనాలు మించి భక్తులు వస్తారని అధికారులు భావించినప్పటికీ తక్కువ సంఖ్యలో రావడం విశేషం.
వైకుంఠాన్ని తలపించిన అంతర్వేది క్షేత్రం
అంగరంగ వైభవంగా
లక్ష్మీనృసింహుని కల్యాణం
సాగర ఘోషను మించిన గోవింద ఘోష
వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
ఏర్పాట్లు చేసిన అధికారులు, సేవకులు
ఆ కనులు ఆత్రంగా.. ఆర్థ్రతతో.. ఆర్తిగా.. ఆరాధనగా.. అనిర్వచనీయమైన భక్తిభావంతో అంతలంతలై చూస్తున్నాయి. ఎక్కడ ఎక్కడ ఎక్కడా అని. ఏ వైపు నుంచి వస్తున్నాడా అని. వేదమూర్తుల మంత్రాలు..
డోలు సన్నాయి.. బాజా భజంత్రీలు..
మేళ తాళాలు.. అమ్మలక్కల హడావుడి.. ఆహూతులకు ఆహ్వానాలు.. కల్యాణ క్రతువుకు కావాల్సిన సామగ్రి అన్నీ వచ్చాయో లేదో.. ఏదైనా మరచిపోయామా అని పదేపదే లెక్కవేసుకుంటున్న పెళ్లిపెద్దలు.. ఇవన్నీ కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి.. అసలైనవారేరీ.. ఇంకా రారే.. ఆ కళ్లు వెదుకుతున్నవి వారి కోసమే. అదే.. వారేనండీ.. దేవదేవుడు.. దేవేరీ.. యుగయుగాలుగా ఎన్నో కల్యాణ వైభోగాలు చూస్తున్నా ఎప్పటికప్పుడే కొత్త. చాలదా ఈ జన్మకి ఆ భాగ్యమని ఎదురు చూపు. ఆ భక్తకోటి కనులు భౌతికంగా ఇక్కడే ఉన్నా..
ఆ.. లోచనాలు వైకుంఠంలో వెతుకుతున్నాయి.. అమ్మతో కూడిన స్వామిని చూడాలని.. వారి కల్యాణాన్ని కనులారా చూడాలని..
అదిగదిగో రానే వచ్చారు. అమ్మవారిని వారు.. అయ్యవారిని వీరు వేదికపైకి
తీసుకువచ్చారు. చాలు చాలు.. వివశులైపోయి చూస్తున్నారదిగో కల్యాణాన్ని..
నేడు రథోత్సవం
అంతర్వేదిలో కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం 2.05 గంటలకు స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నూతన దంపతులుగా స్వామి, అమ్మవార్లు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శన మివ్వనున్నారు. రథయాత్రలో ఆనవాయితీగా అర్చకులు సోదరి గుర్రాలక్క అమ్మవారికి చీర, సారెలను స్వామి తరఫున సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment