నులి పురుగులపై యుద్ధానికి సిద్ధం
● ఆల్బెండజోల్‌తో రక్తహీనతకు చెక్
● పదో తేదీన మాత్రల పంపిణీ
● జిల్లాలో 3.04 లక్షల మందికి ప్రయోజనం
రాయవరం: చిన్నారుల నుంచి యువకుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నులి పురుగులపై ఆల్బెండజోల్ మాత్రలతో మరోమారు యుద్ధానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది. బాలల్లో రక్తహీనతకు ఇవి కారణమవుతున్నాయి. దీని నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నాయి. ఈ నెల 10న నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమవుతోంది. ఒకటి నుంచి 19 ఏళ్ల వారికి ఈ మాత్రలను అందజేయనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 3.04లక్షల మందికి దీనివల్ల ప్రయోజనం కలగనుంది.
ఈ జాగ్రత్తలు పాటించాలి
● బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయకూడదు. ఎల్లప్పుడూ మరుగుదొడ్డినే వాడాలి. ’భోజనం చేసే మందు, మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
● కాలికి షూస్, పాదరక్షలు ధరించాలి.
● గోర్లను శుభ్రంగా, చిన్నవిగా కత్తిరించుకోవాలి.
● ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటినే తాగాలి.
● పండ్లను, కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలి.
● పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
జిల్లాలో పరిస్థితి ఇదీ : అంగన్‌వాడీ కేంద్రాల నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ ప్రథమ సంవత్సరం, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్శింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3,04,318 మందికి డీవార్మింగ్ మాత్రలు మింగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాది లోపు వారికి, తీవ్రమైన అనారోగ్యం కలిగి ఉన్నవారికి ఈ మాత్రలు ఇవ్వరు. ఒకటి నుంచి 19 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరూ ఈ మాత్రలను తీసుకోవడం వల్ల నులి పురుగుల నిర్మూలన జరిగి, రక్తహీనత నివారణ అవుతుంది. ఒకటి నుంచి రెండేళ్ల లోపు పిల్లలు సగం ఆల్బెండజోల్ మాత్రను (200 ఎంజి), రెండేళ్లకు పైబడిన వారు ఒక మాత్ర(400 ఎంజీ) తీసుకోవాలి.
అన్ని శాఖల సమన్వయంతో...
అన్ని శాఖల సమన్వయంతో ఒకటి నుంచి 19 ఏళ్ల వయసున్న విద్యార్థులందరికీ ఈ నెల 10న ఆల్బెండజోల్ మాత్రలను అందించేందుకు ప్రణాళికలు రూపొందించాం. 10న టాబ్లెట్లు తీసుకోని విద్యార్థులకు ఈ నెల 17న మాపింగ్ అప్ ప్రోగ్రామ్ ద్వారా మాత్రలు తీసుకోవడం వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మాత్ర వేసుకున్న తర్వాత ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా దగ్గరలోని వైద్య సిబ్బందిని సంప్రదించాలి.
– డాక్టర్ జాన్ లెవి, జిల్లా ప్రోగ్రామింగ్ అధికారి, ఆర్‌బీఎస్‌కే, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment