మక్కా యాత్రకు ప్రభుత్వాలు సహకరించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీ
సెల్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్
కొత్తపేట: మక్కా యాత్ర సాకారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా తోడ్పడాలని జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ విజ్ఞప్తి చేశారు. కొత్తపేటకు చెందిన మండల ముస్లిం, మైనార్టీ సంఘ నాయకుడు షేక్ గౌస్ మొహిద్దీన్ ఉమ్రా (మక్కా) యాత్రకు వెళ్తున్న సందర్భంగా శుక్రవారం స్థానిక జామియా మసీదులో మసీదు, షాదీఖానా కమిటీ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు షేక్ ఖాజాబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ అబ్దుల్ ఖాదర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా గృహం కాబా, మదీనా సందర్శించాలనేది ప్రతి ముస్లిం కల అని ఆ కలను నేడు గౌస్ కుటుంబం సాకారం చేసుకుంటున్నారన్నారు. అల్లా ఆశీస్సులతో వారి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఉమ్రా, హజ్ యాత్రలకు వెళ్లే వారు సౌదీ ప్రభుత్వ నిబంధన మేరకు వ్యాక్సిన్ చేయించుకుని, దానికి సంబంధించిన సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ సౌకర్యం కల్పించక ఎన్నో వ్యయ ప్రయాసలతో తెలంగాణలోని హైదరాబాద్ వెళ్లి తీసుకోవలసి వస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ చేసి, సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మసీదు ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనం విడుదల కాలేదని, దీనితో ఆదాయం లేని మసీదుల నిర్వహణ కష్టమవుతుందని, ఇమామ్, మౌజన్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అబ్దుల్ ఖాదర్ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల 1 నుంచి రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఈ లోపు ఆ నిధుల విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఉమ్రా యాత్రకు వెళ్తున్న షేక్ గౌస్‌ను, మసీదు అభివృద్ధికి గత ప్రభుత్వంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఎంపీ నిధులు రూ.5 లక్షల మంజూరుకు కృషిచేసిన అబ్దుల్ ఖాదర్‌ను ముస్లిం పెద్దలు, కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ డైరెక్టర్ ఎండీవై షరీఫ్, మసీదు ఇమామ్ ఇంతియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment